తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. అభినందనలు వెల్లువెత్తాయి. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం కాస్త అతిగా ఈ అభిననందలు వచ్చాయి. సౌండ్లు.. సౌండ్లు అంటూ కొంతమంది.. మనస్ఫూర్తిగా కోరుకున్నా.. పైన దేవుడు దీవించారరని మరికొంత మంది తమకు మాత్రమే సాధ్యమైన కవరింగ్లతో.. బయటకు వచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటనే అంత. అవసరం ఉంటేనే వస్తారు. అధికారం ఉంటేనే కనిపిస్తారు. లేకపోతే లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. టాలీవుడ్ ప్రముఖులు కేటీఆర్కు శుభాకాంక్షాలు చెప్పేందుకు క్యూ కట్టారు.
నిజానికి గత ఎన్నికల తర్వాత.. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం.. ఏ అవసరం వచ్చినా చంద్రబాబు వద్దకు వెళ్లేవారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయిన తర్వాత ఓ సారి బహిరంగ హెచ్చరికలే జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండి..చంద్రబాబు వద్దకు వెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖులంతా.. తెలంగాణ ప్రభుత్వ పెద్దల దగ్గరే వెళ్లడం ప్రారంభించారు. ఇలా వెళ్లడానికి.. రెండు సార్లు డ్రగ్స్ కేసులు కూడా కారణం అయ్యాయి. చాలా పెద్ద రేంజ్లో.. ఈ కేసులు హైప్ సృష్టించి.. ఆ తర్వాత వదిలేశారనే విషయం అందరికీ తెలుసు. ఇందులో తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ…ఆ తర్వాత నుంచి… ఎదురుపడినా పలకరించని సెలబ్రిటీలు.. కేటీఆర్కు ట్విట్టర్లో గుడ్ మార్నిగ్లు చెప్పడం ప్రారంభించారు. బర్త్డే విషెస్ అయితే.. ట్విట్టర్ నిండిపోయేది. నాగార్జున లాంటి వాళ్లనయితే పట్టడం కష్టమయ్యేది.
అంతగా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్న వారు.. తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం.. ముఖం చాటేశారు. పోసాని కృష్ణమురళి లాంటి వైసీపీ సానుభూతి పరులు తప్ప.. ఎవరూ పెద్దగా.. స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఇక ప్రచారానికి ఎలా వస్తారు..? టీఆర్ఎస్ తరపున.. ఒక్క సినీ స్టార్ కూడా ప్రచారం చేయలేదు. నాగార్జున లాంటి వాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్లతో బండి నడిపించారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం అందరూ వరుసగా.. అభినందనలు చెప్పడం ప్రారంభించారు. అందుకే.. అంటారు.. విజయానికి అందరూ మిత్రులే .. పరాజయమే అనాథ అని..!