శ్రీదేవి మరణం… ఆమె జ్ఞాపకాలు ఇంకా కలచి వేస్తూనే ఉన్నాయి. ”అరె.. శ్రీదేవి చనిపోవడం ఏమిటి” అని ఇంకా చాలా హృదయాలు.. అల్లాడిపోతున్నాయి. ఆమె మరణం.. చిత్రసీమనే కుదిపేసింది. ఆమె క్రేజ్ ఏంటో.. మీడియా చేసిన హంగామా చూస్తే తెలుస్తుంది. సంపాదించుకున్న అభిమాన ఎంతో… ఆమెను కడసారి చూడ్డానికి వచ్చిన జన సందోహాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. అలాంటి నటి.. మళ్లీ రాదు.
అయితే శ్రీదేవి విలువ, ఆమె స్థానం మన తెలుగు చిత్రసీమకు బొత్తిగా అర్థమైనట్టు లేదు. శ్రీదేవి మరణ వార్త విని.. సంతాప సందేశాలు పంపి చేతులు దులుపుకున్నారంతా. ఎవరికి వాళ్లే.. పేజీల కొద్దీ సంతాప సందేశాలు పంపారు. వీడియోలు వదిలారు. కాకపోతే అదంతా మొక్కుబడి తంతే అని అర్థమైపోతోంది. మరి తెలుగు చిత్రసీమ కలసి కట్టుగా ఏం చేసింది..? కనీసం ఒక్క సంతాప సభ అయినా నిర్వహించిందా? లేదే..! ‘మా’ సంగతే చూడండి. `మేం ఇన్ని గొప్ప ఘన కార్యాలు చేస్తున్నాం` అని పబ్లిసిటీ స్టంట్ కోసం తహతహలాడిపోయే ‘మా’కి శ్రీదేవి ఘనత అర్థం కాలేదా? చిత్రసీమ సంగతి అటుంచండి. కనీసం `మా` తరపున ఒక్క సంతాప సభ అయినా నిర్వహించారా?
థియేటర్ల బంద్ గోలలో టాలీవుడ్ మొత్తం మునిగిపోయింది. ఒక్కరోజు థియేటర్లు మూతబడితే నష్టమెంత? అనే లెక్కల్లో వాళ్లకు గుండెల్లో గుబులు పట్టుకుంది. అలాంటి వాళ్లకు శ్రీదేవి ఏం కనిపిస్తుంది? శ్రీదేవి మృతికి సంతాపంగా షూటింగు ఒక్క రోజంటే ఒక్క రోజు బంద్ చేశారా? హాయిగా సోమవారం ఎవరి దుకాణాలు వాళ్లు తెరచేసుకున్నారు. ఇదేనా.. జాతీయ స్థాయి నటికి మనం ఇచ్చే గౌరవం. శ్రీదేవి అంటే.. `ఏదో హిందీ హీరోయిన్లే` అనుకుంటుందా తెలుగు చిత్రసీమ..? ఆ మాటకొస్తే ఆమె సినీ కెరీర్లో అద్భుతమైన విజయాలు తెలుగులోనే ఉన్నాయి. తెలుగు నుంచే ఆమె స్టార్‌గా ఎదిగింది. అలాంటి నటీమణికి తెలుగు చిత్రసీమ తగు రీతిలో వీడ్కోలు పలకడం భావ్యం. కానీ ఏం జరిగిందిప్పుడు..? కనీసం సంతాప సభకు కూడా నోచుకోని మరణమైపోయింది శ్రీదేవిది.
శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయి 24 గంటలు గడవలేదు.. ఈలోగా టీజర్లు, ట్రైలర్లు, పాటలు అంటూ ఎవరి హడావుడిలో వాళ్లు పడిపోయారు. కొంతమంది సినీ సెలబ్రెటీలు హోళీ ఫొటోలు ట్విట్టర్లలోనూ, ఫేస్ బుక్కులలోనూ పోస్ట్ చేసుకున్నారు. హోళీ చేసుకుంటే చేసుకున్నారు సరే.. కనీసం జనం కోసమైనా ఈ పబ్లిసిటీ ఫీట్లు ఆపాలి కదా? ఆదివారం సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాన్నీ మనం ఓ ప్రయివేటు ఫంక్షన్లానే చూడాలి. ఎందుకంటే సుబ్బిరామిరెడ్డి ఇండ్రస్ట్రీ వ్యక్తి కాదు. ఆయనో వ్యాపార వేత్త. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు కూడా ఆయనే భరిస్తాడు. అందునా ఆయన హోటలే అందుకు వేదిక. శ్రీదేవి లాంటి కథానాయికకు శ్రద్దాంజలి ఘటించే తీరిక లేదు సరే.. కనీసం ఫంక్షన్ కి అయ్యే ఖర్చు కూడా తెలుగు చిత్రసీమ భరించలేదా? మరీ అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా..??
మొన్న గుండు హనుమంతరావు చనిపోయిన మరుసటి రోజు.. ఫిల్మ్ ఛాంబర్లో కె.విశ్వనాథ్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఒక్కరంటే ఒక్కరు.. గుండు హనుమంతరావు మృతికి సంతాపం తెలపలేదు. ఈ విషయం తెలిసి.. ”అయ్యో.. పాపం” అనుకున్నారు మిగిలిన వాళ్లు. ఇప్పుడు శ్రీదేవి లాంటి కథానాయికకే దిక్కులేదు. ఇక గుండు లాంటి వాళ్లని ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు? దాసరి నారాయణరావు ఉండి ఉంటే ఇలా జరిగేదా? పరిశ్రమలో ఏం జరిగినా.. ఆయన ముందుకొచ్చేవాడు. ఎవరు మరణించినా హీన పక్షం రెండో రోజు ఫిల్మ్ ఛాంబర్లో సంతాప సభ జరిగేది. దాసరి పోరు పడలేక మిగిలినవాళ్లంతా వచ్చేవారు. అలా.. ఓ నాయకుడు లేకపోవడం కూడా.. ఇప్పుడు లోటుగానే కనిపిస్తోంది. పుట్టిన రోజు పండగల్ని సెలబ్రేట్ చేసుకొనడంలో హుషారు.. చావుని స్మరించుకోవడంలో లేదేంటో..? గ్లామర్ ప్రపంచం అంతా ఇంతేనా??