టాలీవుడ్ సెలబ్రిటీలంతా.. ఇప్పుడు హడావుడిగా ఉన్నారు. ఇంటి పెరట్లోనో.. ఫామ్‌హౌసుల్లోనో మొక్కలు నాటి… వీడియోలు తీసి… సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తమకు ఎవరో చాలెంజ్ విసిరితే..వారి చాలెంజ్‌కు అనుగుణంగా మొక్కలు నాటి..మరో ముగ్గురికి చాలెంజ్ విసురుతున్నారు. టాలీవుడ్లో గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఓ ఉద్యమంలా.. గ్రీన్ చాలెంజ్‌ను .. చేస్తున్నారు. చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకూ సూపర్ స్టార్లందరూ మొక్కలు నాటేశారు. చాలెంజ్‌లు తీసుకున్నారు. మళ్లీ ఇచ్చారు. ఒక్క పవన్ కల్యాణ్ మాత్రం అన్న ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించి మొక్కను నాటారు. కానీ తను మాత్రం ఎవరికి చాలెంజ్ చేయలేదు.
టాలీవుడ్ స్టార్లలో పర్యావరణం, మొక్కలు నాటడంపై … ఇంత ఆసక్తి ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా ప్రస్తుతం… వ్యవహారాలు నడుస్తున్నాయి. నిజం చెప్పాలంటే… గతంలో ఎప్పుడూ ఇలాంటి చాలెంజ్‌లో స్టార్లు పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అలా చేస్తే.. తమ సెలబ్రిటీ స్టేటస్ తగ్గిపోతుందని ఫీలయ్యేవాళ్లు. కానీ ఈ సారి మాత్రం ఎవరూ వెనుకడుగు వేయడం లేదు. ఎందుకంటే.. తమకు చాలెంజ్ చేసిన వాళ్లు… వయసులో చిన్న వాళ్లే కానీ.. అధికారంలో పెద్ద వాళ్లు కాబట్టి. తెలంగాణలో హరిత హారం కార్యక్రమానికి ప్రచారం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత.. తొలిసారి మొక్కలు నాటి.. ముగ్గురికి చాలెంజ్ చేశారు. ఆ ముగ్గురు మరో తొమ్మిది మందికి.. ఆ తొమ్మిది మంది మరో ఇరవై ఏడు మందికి సవాల్ చేస్తూ పోతున్నారు. అందరూ ప్రముఖులే కాబట్టి… మీడియాలో హైలెట్ అయిపోతున్నాయి. మీడియా సంస్థల యజమానులు కూడా ఇందులో యాక్టివ్‌గా ఉండటం ఈ సారి విశేషం.
ఈ చాలెంజ్‌లను తప్పు పట్టలేం కానీ… రిలీజ్ అవుతున్న వీడియోలు… బయటకు వస్తున్న ఫోటోలు చూస్తూంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గొప్ప ఇనిషియేటివ్… స్వచ్చభారత్ ప్రోగ్రాం గుర్తుకు వస్తుంది. ఉదాత్త ఆశయంతో ప్రారంభించిన ఆ కార్యక్రమాన్ని సెలబ్రిటీలందరూ దత్తత తీసుకున్నారు. చీపుళ్లు పట్టుకుని ఫోటోలు దిగారు. మీడియాలో పబ్లిసిటీ పొందారు. కానీ దాని వల్ల ఏమైనా మార్పు వచ్చిందా..? అంటే… ఒక్కటంటే.. ఒక్క శాతం కూడా.. దేశంలో శుభ్రతలో మార్పు రాలేదు. పైగా.. వీరు చేసిన ఫోటోసెషన్స్పై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. వారే అలా ఉంటే.. మేము ఎలా ఉన్నా తప్పు లేదన్న భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడది.. స్వచ్చభారత్ పేరుతో కేంద్రం సెస్ వసూలు చేసుకోవడానికి పనికి వచ్చింది. ఆ సెస్‌తో స్వచ్చ భారత్ కోసం ఎన్ని మరుగుదొడ్లు కట్టించారో.. ఎన్ని డస్ట్ బిన్లు ఏర్పాటు చేశారో.. ఎవరికీ తెలియదు.
దేశంలో స్వచ్చభారత్.. తెలంగాణలో హరితహారం గ్రీన్ చాలెంజ్ సెలబ్రిటీలకు..మరో వ్యాపకంగా మారింది. మొదటిది చల్లారిపోయింది. రెండోది మాత్రం ఇప్పుడే ప్రారంభమయింది. వారు ఓ మొక్క నాటడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చేసి… తెలంగాణను హరితవనం చేస్తారని ఆశించడం అత్యాశే. అలాంటి సందేశాలు కూడా.. సెలబ్రిటీల నుంచి రావడం లేదు. ఫన్ ప్రోగ్రాంలా చాలెంజ్ తీసుకుంటున్నారు.. ఇస్తున్నారు అంతే.. !