నిర్మాతలంతా కలిసి బంద్ చేయడానికి గల కారణం ఏమిటో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ల ఎజెండా మొత్తం.. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం పైనే. వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, తమ బాధల్ని చెప్పుకొని, బడ్జెట్ కంట్రోల్ చేయడానికి తమ వంతు సహాయం చేయాలని అర్జీలు పెట్టుకోవడమే. అయితే… నిర్మాతలంతా క్యారెక్టర్ ఆర్టిస్టుల తీరు తెన్నులపై తీవ్ర ఆగ్రహం, అసహనంతో ఉన్నారు. హీరోలు, హీరోయిన్ల పారితోషికాలు ఎలాగూ తగ్గవు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుల తోకలు కట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు వాళ్ల టార్గెట్ కి రీచ్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టులందరి విషయంలోనూ నిర్మాతలు కొన్ని తీర్మానాలు చేశారు. వాటికి ఆమోదం కూడా లభించింది.
* హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల సిబ్బందికి జీతాలు, బత్తాలు…. నిర్మాతలు చెల్లించరు. ఒకవేళ వీళ్లు అసిస్టెంట్లని పెట్టుకొంటే వాళ్లే జీతాలు ఇచ్చుకోవాలి.
* భోజన సదుపాయం విషయంలోనూ స్ట్రిక్ట్ రూల్స్ విధించారు. సెట్లో ప్రొడక్షన్ ఏం పెడితే అది తినాలి. గొంతమ్మ కోర్కెలు తీర్చరు.
* కార్లూ, కార్ వాన్ల విషయంలోనూ ఇంతే. ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కలిపి ఒక కార్ వాన్ ఏర్పాటు చేస్తారు. సెపరేట్గా కార్ వాన్ కావాలంటే ఆ అదనపు ఖర్చుని సదరు నటీనటులు భరించాలి.
* మనకు పరభాషా హీరోయిన్లే ఎక్కువ. వాళ్లంతా ముంబై నుంచో, గోవా నుంచో వచ్చేటప్పుడు అక్కడి నుంచి సహాయక సిబ్బందిని తీసుకొస్తుంటారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. హీరోయిన్ల సహాయక సిబ్బంది ఎవరైనా ఉంటే.. వాళ్లని స్థానికంగా ఉన్నవాళ్లనే ఎంచుకోవాలి. వాళ్ల జీత భత్యాలు, వసతి విషయంలో నిర్మాతలకు ఎలాంటి సంబంధం లేదు.
* హీరోల నుంచి కూడా సపోర్ట్ వస్తుందని నిర్మాతలు ఆశించారు. ఎవరూ ఏ హీరో దగ్గరకు వెళ్లి.. మీరు పారితోషికం తగ్గించుకోవాలి. అని ఏ నిర్మాతా అడగలేదు. అలానే హీరోలు కూడా `మేం పారితోషికం తగ్గించుకుంటాం` అని నిర్మాతలకు భరోసా ఇవ్వలేదు. కానీ చరణ్, ఎన్టీఆర్లు మాత్రం ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాల పారితోషికాన్ని తగ్గించుకొంటామని నిర్మాతలకు హమీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మిగిలిన హీరోలూ ఇలానే స్వచ్ఛందంగా ముందకొస్తే నిర్మాతలు తలపెట్టిన బంద్ కు తగిన ప్రతిఫలం దక్కినట్టే.