కామెడీ అంటే అందరికీ ఇష్టమే. హాయిగా నవ్వుకోవడానికి ఏం రోగం చెప్పండి?! కాకపోతే… కామెడీనే మరీ కాస్ట్లీ వ్యవహారంగా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్లు ఎక్కడా ఉండరని గర్వంగా చెప్పుకొంటాం. కానీ.. వాళ్ల రేట్లూ అదే స్థాయిలో ఉన్నాయి. ప్రతీ సినిమాలోనూ ఆరేడుగురు హాస్య నటులు కనిపించడం పరిపాటి. వాళ్లలో కొంతమంది సినిమాకింత అని ఛార్జ్ చేస్తే, మరికొంతమంది రోజుకింత అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం గంటకింత అంటూ వసూలు చేస్తున్నారు. దాంతో కమెడియన్లని భరించడం కంటే, హీరోల్ని భరించడమే ఈజీ అనుకొంటున్నారు నిర్మాతలు.
దీనిపై హాస్య నటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి స్పందించారు. కమెడియన్ల పారితోషికాలు మరీ ఎక్కువైపోతున్నాయని నిర్మాతలు గోల పెడుతున్నారు. వీటిపై మీ కామెంట్ ఏమిటంటే… ‘పెట్రోలు రేట్లు పెరుగుతున్నాయ్.. ఉల్లిగడ్డల రేట్లు పెరుగుతున్నాయి. అలానే కమెడియన్ల రేట్లు కూడా’ అంటూ వాళ్ల స్టైల్లో సమాధానం ఇచ్చారు. ”కామెడీకి విలువ లేదా, కామెడీని తక్కువ ధరకే చేయాలా.. కామెడీ అంటే చీపా..” అంటూ రాహుల్ రామకృష్ణ సెటైర్ వేశాడు. నిజానికి వీళ్ల మాటల్లోనూ పాయింట్ ఉంది. అన్ని రేట్లూ పెరుగుతున్నాయి కాబట్టి, నటీనటులుగా తమ పారితోషికాన్ని కూడా పెంచుకొంటూ వెళ్తున్నారు. కాకపోతే సినిమాని స్టాక్ మార్కెట్ తోనూ, పెట్రోల్ రేట్లతోనూ పోల్చలేం. ఇది కళాత్మక వ్యాపారం అనుకొంటున్నాం కాబట్టి, సినిమా అనేది అభిరుచులతో ముడిపడిన వినోదం అని చెప్పుకొంటున్నాం కాబట్టి, కొన్నిసార్లు నిర్మాతల కోసమో, తమ సొంత ఇష్టాల కోసమో.. పారితోషికాల విషయంలో కాస్త ముందు, వెనుక ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నిర్మాత మునిగిపోతున్నాడు అనుకొంటున్నప్పుడు తమ చేయి అందించి, వాళ్లని ఒడ్డున పడేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కొంతమంది మాత్రం.. బాలెన్స్ పేమెంట్ ఇచ్చేంత వరకూ డబ్బింగ్ కూడా చెప్పం అని మెండికేస్తుంటారు. అలాంటి వాళ్లతోనే ఇబ్బంది.