ప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు (69) సోమవారం రాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా హృద్రోగం తదితర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. నిన్న రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆయనని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు కానీ ఆయన ఆసుపత్రికి చేరుకోక మునుపే ప్రాణాలు విడిచారు.
కొండవలస లక్ష్మణరావు ఆగస్ట్ 10,1946న శ్రీకాకుళం జిల్లా కొండవలసలో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం విజయనగరంలో స్థిరపడింది. కొండవలసకి చిన్నపాటి నుంచే బుర్రకధలు, నాటాకాలు అంటే చాలా ఆసక్తి చూపేవారు. ఆయన వైజాగ్ పోర్టులో పనిచేస్తూనే నాటకాలు వేసేవారు. ‘సవతి తల్లి’ అనే తొలి నాటికలోనే ఆయన ద్విపాత్రాభినయం చేయడం, దానికి నంది అవార్డు అందుకోవడం ఆయన నటనా ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును. మళ్ళీ ‘కేళీ విలాసం’ అనే నాటకంలో ఆయన విలన్ పాత్ర చేసి మరో మారు నంది అవార్డు అందుకొన్నారు. ఆయన సుమారు 2,000 నాటకాలలో నటించారు.
వంశీ దర్శకత్వం వహించిన “అవును వాళ్లిదరూ ఇష్టపడ్డారు” సినిమాతో ఆయన సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుండి మరిక వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన సుమారు 300పైగా సినిమాలలో నటించారు. “ఐతే నాకేటి…?, “నేనొప్పుకోను…ఐతే ఒకే..”వంటి డైలాగులు వినగానే అది ఎవరు పలికారో ప్రజలు చెప్పేసే అంతగా ఆయన పాపులర్ అయిపోయారు.
కబ్బడీ కబ్బాడీ, దొంగ రాముడు అండ్ పార్టీ, సత్యం, పల్లకీలో పెళ్లి కూతురు, రాధా గోపాళం, కాంచనమాల కేబుల్ టీవి, ఎవడి గోల వాడిదే, అందాల రాముడు, బాస్, సైనికుడు, రాఖి, అత్తిలి సత్తిబాబు, సుందర కాండ, బ్లేడు బాబ్జి, బెండు అప్పారావు ఆర్.ఎం.పి.,అదుర్స్, వరుడు, కత్తి కాంతారావు వంటి అనేక సినిమాలలో కొండవలస నటించారు. గత కొంత కాలంగా తెలుగు సినీపరిశ్రమ వరుసగా హాస్యనటులను కోల్పోవడం చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ చాలా బాధ కలిగిస్తోంది. ఏవి.యస్., ధర్మవరం సుబ్రహ్మణ్యం,తెలంగాణా శకుంతల, ఎం.ఎస్. నారాయణ, శ్రీహరి, ఆహుతి ప్రసాద్, మొన్న కళ్ళు చిదంబరం, నిన్న కొండవలస ఇలాగ వరుసగా చాల మంది నటులు వరుసగా చనిపోతుండటం అందరినీ దిగ్బ్రాంతి పరుస్తోంది. కొండవలస అంత్యక్రియలు ఈరోజు నిర్వహించబడుతాయి.