2024 క్యాలెండర్ ముగింపు దశకు వచ్చేసింది. ఇక అంతా 2025లో రాబోయే సినిమాల గురించి లెక్కలేసుకొంటున్నారు. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? ఏ సీజన్లో ఏ స్టార్ సందడి చేయబోతున్నాడు? అనే విషయాలపై ఇప్పటి నుంచే ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. అయితే 2025 క్యాలెండర్ ఇయర్ అంత సాఫీగా సాగేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే రిలీజ్ డేట్ల విషయంలో కాస్త గందరగోళం ఉంది. ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు 2025 రిలీజ్డేట్ల పై కర్చీఫ్ వేశాయి. అయితే ఇప్పుడు ఆ డేట్లు ఇరకాటంలో పడ్డాయి. కొన్ని సినిమాల విడుదలపై సందిగ్థత నెలకొంది. డేట్లు మారే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి.
‘రాజాసాబ్’ ఏప్రిల్ 10న రావాలి. అయితే ఈ సినిమా కాస్త ఆలస్యమయ్యే ఛాన్సుంది. అందుకే ఏప్రిల్ 10 పై కొన్ని చిత్రాలు గురి పెట్టాయి. సిద్దు జొన్నలగడ్డ సినిమా ‘జాక్’ ఏప్రిల్ 10న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ‘విశ్వంభర’ కూడా ఇదే డేట్ పై దృష్టి పెట్టింది. మే 9న ‘విశ్వంభర’ విడుదల చేద్దామనుకొన్నారు. ఇప్పుడు కాస్త ముందుకు కదిలే ఛాన్సుంది. ఒకవేళ ‘విశ్వంభర’ ముందుకు వచ్చేస్తే మే 9న విజయ్ దేవరకొండ సినిమా రావొచ్చు. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని చిత్రబృందం ఆలోచనలో పడింది. ‘విశ్వంభర’ గనుక మే 9న వస్తే విజయ్ సినిమా ప్లానింగ్ లో మార్పు ఉండొచ్చు. మే 9నే రవితేజ సినిమా ‘మాస్ జాతర’ రావొచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు రవితేజ సినిమా కూడా వెనక్కి వెళ్తుంది. ‘రాజాసాబ్’ ఎప్పుడొస్తుందన్న దాన్ని బట్టి మిగిలిన సినిమాలు ప్లానింగ్ చేసుకొంటాయి. ఏప్రిల్ 10 దాటితే మే 9 మంచి డేట్. ఒకవేళ ‘రాజాసాబ్’ ఆ డేట్ ఫిక్స్ చేసుకొంటే… మిగిలిన సినిమాల రిలీజ్ డేట్లు గందరగోళంలో పడతాయి.
ఇలాంటి సందిగ్థత ఇది వరకు కూడా చాలాసార్లు వచ్చింది. అప్పుడు నిర్మాతలంతా కూర్చుని మాట్లాడుకొన్నారు. ఎవరి సినిమాలు ఎప్పుడొస్తాయి? అవి ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి? అనే విషయంలో స్పష్టత వస్తే.. అన్ని సినిమాల రిలీజ్ డేట్లు కుదురుకుంటాయి. లేదంటే ఈ సస్పెన్స్ తప్పదు.