హారర్, థ్రిల్లర్ జోనర్లో ఓ సినిమా హిట్టయి చాలా కాలమైంది. ఆ జోనర్‌ని ఎవరూ టచ్ చేయడం లేదు కూడా. ఎందుకంటే.. ఈ తరహా కథలు ఇప్పుడు ఓటీటీలకు పరిమితమయ్యాయి. దాన్ని ఓటీటీకే అంకితం చేసేశారు దర్శకులు, రచయితలు. అయితే విరూపాక్షతో ఈ జోనర్‌కి థియేట్రికల్ గానూ ఆదరణ ఉంటుందని నిరూపితమైంది. మసూద కూడా ఈ జోనర్ కథే. ఆ సినిమా కూడా బాగా ఆడింది. ఈ రెండు విజయాలతో ఇప్పుడు టాలీవుడ్ లో థ్రిల్లర్, హారర్ జోనర్‌కి కొత్త గిరాకీ వచ్చినట్టైంది. కొంతమంది నిర్మాతలు.. ఈ తరహా కథలపై ఇప్పుడు దృష్టి సారించారు. విరూపాక్ష విజయంతో.. యువ హీరోలూ.. వీటిపై కన్నేశారు.
అయితే మసూద, విరూపాక్ష విజయాలకు కథ కంటే సాంకేతిక నైపుణ్యం బలంగా ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్.. కెమెరా పనితనం బ్రహ్మాండంగా కుదిరాయి. థ్రిల్లర్ చిత్రాలకు సాంకేతిక పరంగా ఏం చేయాలో, అవన్నీ చేశారు. అందుకే ఆ కథలు అంత బలంగా తెరపై చూపించగలిగారు. ఇవే సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే ఆడకపోవొచ్చు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ జోనర్ సినిమాలు చూడాలి. ఇక నిర్మాతలు సౌండ్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టగలిగితే… ఈ జోనర్‌కి ఇంకొంత కాలం మనుగడ ఉంటుంది. థ్రిల్లర్, హారర్ సినిమా అంటే తక్కువలో చుట్టేయొచ్చు అనే భ్రమల్లోంచి బయటకు వచ్చి, దానిపై కూడా ఖర్చు పెట్టగలిగితే… ఈ జోనర్లో ఇంకొన్ని హిట్లు పడతాయి.