సినిమాలకి సంక్రాంతి పెద్ద సీజన్. 2025 సంక్రాంతికీ భారీ సినిమాల సందడి వుంది. దానికంటే ముందు డిసెంబరులో ఈసారి కొత్త సినిమాల జాతర కనిపిస్తోంది. డిసెంబర్ లో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు భారీ, మీడియం, చిన్న సినిమాలు వరుస కడుతున్నాయి.
డిసెంబర్ మొదటి వారం బాక్సాఫీసుని రూల్ చేయడానికి ‘పుష్ప 2’తో వస్తున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప 1’ సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ వచ్చింది. పుష్ప ఒక బ్రాండ్ అయ్యింది. ఇప్పుడు అంతకుమించిన అన్నట్టు పుష్ప 2ని సిద్ధం చేశారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్న సినిమా ఇది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ ‘పుష్ప 2’ ని ఇంటర్నేషనల్ లెవల్ లో తీర్చిదిద్దాడు. ఈసారి పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అన్నట్టుగా చూపించాడని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. ఇప్పటికే సినిమా ప్రీరిలీజ్, ప్రీ బుకింగ్స్ లో కొత్త రికార్డులు నెలకొల్పింది. డిసెంబర్ 5న సినిమా వస్తోంది. ఈ వారంలో మరో సినిమా లేదు. ఆ తర్వాత రెండు వారాలు కూడా పుష్ప సోలో రూల్ ఉండబోతోంది.
పుష్ప 2 రిలీజ్ తర్వాత మిగతా సినిమాలు క్రిస్మస్ సెలవులని టార్గెట్ చేశాయి. ఏకంగా డజను సినిమాలు చివరి రెండు వారాల్లో వస్తున్నాయి. అల్లరి నరేశ్ ‘బచ్చలమల్లి’తో డిసెంబరు 20న వస్తున్నాడు. సుబ్బు మంగదేవి దర్శకుడు. అమృత అయ్యర్ హీరోయిన్. ఇదొక రియల్ లైఫ్ స్టొరీ. గమ్యం నాంది సినిమాల్లా తన కెరీర్ లో గుర్తుండిపోతుందని నమ్మకంగా చెబుతున్నాడు నరేష్.
ప్రియదర్శి, మోహనకృష్ణ ఇంద్రగంటి ‘సారంగపాణి జాతకం’ డిసెంబర్ 20నే వస్తోంది. కామెడీకి పెద్ద పీట వేసిన సినిమా ఇది. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డార్లింగ్ తో నిరాశ పరిచాడు ప్రియదర్శి. ఇంద్రగంటి గత సినిమాలు నిరాశ పరిచాయి. ఇద్దరికీ సినిమా కీలకం.
డిసెంబర్ 20న రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. మల్టీ ట్యాలెంటెడ్ ఉపేంద్ర హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం ‘యూఐ’. ఇదొక ఫాంటసీ చిత్రం. ఉపేంద్ర ఆలోచనలు కొత్తగా వుంటాయి. ఈ సినిమాలో ఆయన ఎలాంటి అంశాలని టచ్ చేశారనే ఆసక్తి అయితే వుంది.
గతేడాది ప్రేక్షకులు ముందుకు వచ్చి సినిమా ‘విడుదల’. వెట్రిమారన్ దర్శకుడు. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో కనిపించారు. దానికి సీక్వెల్గా రూపొందిన ‘విడుదల: పార్ట్ 2’డిసెంబరు 20న విడుదల కానుంది. పార్ట్ 1 తమిళ్ లో మంచి విజయం సాధించింది కానీ తెలుగు పెద్దగా ఆదరణ దొరకలేదు. పార్ట్ 2 రిజల్ట్ ఎలా వుంటుందో చూడాలి. వీటితో పాటు మహేష్ బాబు వాయిస్ అందించిన ముఫాసా, రాజేంద్ర ప్రసాద్ మనవరాలు తేజస్విని నటించిన ఎర్రచీర సినిమాలు కూడా డిసెంబర్ 20నే వస్తున్నాయి.
అంతా కొత్తవారితో ‘మ్యాజిక్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. సితార నాగవంశీ నిర్మాత. ఇదొక మ్యూజికల్ స్టొరీ. అనిరుద్ మ్యూజిక్ అందించడం మరో విశేషం. జెర్సీ లాంటి మంచి సినిమా తీసిన దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ద్రుష్టిని ఆకర్షించింది. డిసెంబరు 21న వస్తుంది.
నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న క్రైమ్ కామెడీ ‘రాబిన్హుడ్’ శ్రీలీల హీరోయిన్. ‘భీష్మ’ తర్వాత నితిన్, వెంకీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఆకర్షించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. తన కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అని స్వయంగా నితిన్ చెబుతున్నారు. టీజర్ లో నితిన్ క్యారెక్టర్ ఆసక్తిని పెంచింది. డిసెంబరు 25న రిలీజ్.
ఇదే డేట్ కి వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ అనే డబ్బింగ్ సినిమా కూడా తెలుగు లోకి వస్తోంది. తేరీకి రిమేక్ ఇది. డిసెంబర్ 27న పతంగ్ అనే ఓ చిన్న సినిమా వస్తోంది. మొత్తానికి ఈసారి సంక్రాంతి ముందే బాక్సాఫీసు వద్ద పండగ కళ కనిపిస్తోంది.