సినిమా – టీవీ ఛానళ్ల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇందులో కీలకమైన మలుపు ఈరోజు రాబోతోంది. అర్థరాత్రి 12 గంటల నుంచి టీవీ ఛానళ్లకు కంటెంట్ ఇవ్వకూడదని తెలుగు చిత్రసీమ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఈ రోజు అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నదని సమాచారం. అయితే ఇదేం అధికారిక బహిష్కరణ కాదు. అనధికారంగానే తెలుగు చిత్రసీమ తీసుకున్న నిర్ణయం. ఇక మీదట ఏ టీవీ ఛానల్ అయినా సరే, ట్రైలరు, టీజరు ప్రసారం చేస్తే వాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. `మాకు మీ ప్రమోషన్లు వద్దు.. మీకు మా కంటెంట్ వద్దు` అనే రీతిలో తెలుగు చిత్రసీమ ఈ నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తోంది. కొన్ని రోజుల తరవాత ఈ నిర్ణయం వర్కవుట్ అయ్యిందా? లేదా? అనే విషయంపై చిత్రసీమ మళ్లీ చర్చ జరిపి.. అప్పుడు ఓ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. న్యూస్ ఛానళ్లు దాదాపుగా 30 శాతం కార్యక్రమాలు సినిమా ఆధారితంగానే నడుస్తున్నాయి. ఇంటర్వ్యూలు, ఆడియో కార్యక్రమాలు, చర్చావేదికలు, లైవ్ షోలు.. ఇవన్నీ సినిమా ఆధారిత కంటెంట్‌తోనే నడుస్తాయి. ఇప్పుడు ఆ కంటెంట్‌ని ఇవ్వరన్నమాట. మరి వాణిజ్య ప్రకటనల మాటేంటి? అనేదే ఇంకా తేలాల్సివుంది. కంటెంట్ ఇవ్వడం ఆపేస్తే… ఛానళ్లు ఊరుకుంటాయా? ఇప్పటికే చిత్రసీమపై గుర్రుగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.