దర్శకుడు పూరి జగన్నాథ్ పెన్ను పేపర్ మీద పరుగులు పెట్టాలంటే బ్యాంకాక్ వెళ్లాల్సిందే! హీరోలకు కథ చెప్పాక… బ్యాంకాక్ వెళ్లి సీన్లు, స్క్రీన్ ప్లే, డైలాగులు రాస్తానని పలు సందర్భాల్లో పూరి జగన్నాథ్ స్వయంగా చెప్పారు. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన సంగతే. కథ రాయడానికి వారం రోజులు… ఆ తర్వాత బౌండ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి వారం రోజులు… అంతకు మించి ఏ సినిమాకి ఎక్కువ టైమ్ తీసుకోలేదని పూరి జగన్నాథ్ చెప్పిన రోజులు వున్నాయి. అటువంటి పూరి స్టైల్ ఇప్పుడు మారింది. బ్యాంకాక్‌కి పూరి ప్యాకప్ చెప్పారు. బ్యాంకాక్ వెళ్లడం మానేశారు. ప్రస్తుతం భాగ్య నగరం (హైదరాబాద్)లో కథ రాస్తున్నారు. ‘మెహబూబా’ తరవాత తనయుడు ఆకాష్ పూరితో మరో సినిమా చేయడానికి పూరి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా కథను హైదరాబాద్ గచ్చిబౌలిలోని పార్క్ హోటల్ లో ప్రస్తుతం పూరి కథ పూర్తి చేసే పనిలో వున్నారు. త్వరలో ఈ సినిమా వివరాలను వెల్లడించనున్నారు. ‘మెహబూబా’తో మేకింగ్ స్టైల్ మార్చిన పూరి, ఇప్పుడు పాత పద్ధతులు, సెంటిమెంట్లను పక్కన పెడుతున్నారన్నమాట!!