అగ్ర దర్శకులు బోయపాటి శ్రీను, కొరటాల శివ బంధువులు. రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ద్వారా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. పోసానికి ఇద్దరూ దగ్గర చుట్టాలు. కానీ, ఇద్దరి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు అనేది ఇండస్ట్రీలో జనాలకు, ప్రేక్షకులకూ తెలిసిన విషయమే. మీడియా ముందుకు ఎప్పుడూ ఒక్కటిగా వచ్చిన సందర్భాలు కూడా లేవు. ఉప్పు నిప్పు అన్నట్టు వుండే వీరిద్దరూ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కలిసి ఫొటోలు దిగారు. ఒక్క ఫ్రేమ్‌లో వచ్చారు. బుధవారం రాత్రి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అరవింద్ తన ఇంట్లో కుటుంబ సభ్యులకు, ఇండస్ట్రీ ప్రముఖులకు, సన్నిహితులకు భారీ విందు ఇచ్చారు. విందులో మెగాస్టార్‌తోనూ, మెగా హీరోలతోనూ దర్శకులు ఫొటోలు దిగారు. ఫొటోలో పక్క పక్కన నిలబడ లేదు కానీ… కలిసే ఫొటో దిగారు. అంతకు ముందు క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో విడిపోయిన దర్శకుడు శ్రీనువైట్ల, రచయిత కోన వెంకట్ ‘బ్రూస్లీ’కి కలిసి పనిచేశారు. అదీ చిరంజీవి చెప్పడంతో కాదనలేక! మళ్లీ వాళ్లిద్దరూ కలిసి పని చేయలేదనుకోండి! ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొరటాల, బోయపాటి ఒక్క ఫొటోలో కనిపించారు. మళ్లీ ఎప్పుడు ఇటువంటి ఫొటో దిగుతారో!!