టాలీవుడ్ లో కొంతమంది దర్శకులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. కథలు, నిర్మాతలూ రెడీగా ఉన్నా హీరోలు దొరకడం లేదు. అందుకే వాళ్ల సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. కొంతమంది దర్శకులలైతే హీరోల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి, ఆ కథల్ని సైతం పక్కన పెట్టేస్తున్నారు. తెలుగులో హీరోలు సెట్ అవ్వడం లేదని పక్క భాషల హీరోలవైపు ఆశగా చూస్తున్నారు. మన హీరోలేమాత్రం ఖాళీగా లేకపోవడం, ఒకొక్కరూ రెండు మూడు కథల్ని సెట్ చేసుకోవడంతో దర్శకులు ఖాళీగా ఉండిపోవాల్సివస్తోంది.
‘ఖుషి’ తరవాత శివ నిర్వాణ కొత్త సినిమా ఏదీ మొదలు కాలేదు. తన దగ్గర ఓ కథ రెడీగా ఉంది. నిర్మాత కూడా సిద్ధమే. అయితే… హీరో దొరకడం లేదు. నాగచైతన్యతో ఓ సినిమా చేద్దామనుకొన్నాడు శివ. ఆ కథ కూడా చైతూకి నచ్చింది. అయితే పట్టాలెక్కడం ఆలస్యం అవుతోంది. ఈలోగా ఓ హీరోని వెదికి పట్టుకోవాలి. పరశురామ్ పరిస్థితీ అంతే. ‘ఫ్యామిలీ స్టార్’ తరవాత తన ప్రాజెక్ట్ మొదలవ్వలేదు. కార్తీతో ఓ సినిమా చేద్దామని ప్రయత్నించాడు. కుదర్లేదు. దిల్ రాజు ఇప్పటికే పరశురామ్ కు అడ్వాన్స్ ఇచ్చేశాడు. హీరో కుదరక.. ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడం లేదు.
‘మనం’ తరవాత శ్రీరామ్ ఆదిత్య ఖాళీ. కొంతమంది నిర్మాతల దగ్గర శ్రీరామ్ అడ్వాన్సులు తీసుకొన్నాడు. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లాలంటే హీరో కావాలి. ‘మనం’ దెబ్బతో.. శ్రీరామ్‌కు హీరో దొరకడం కష్టమవుతోంది. దానికి తోడు యంగ్ హీరోలంతా బిజీ అయిపోయారు. సురేందర్ రెడ్డి లాంటి మాస్ డైరెక్టర్ ఖాళీగా ఉన్నాడంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. సూరి ప్రస్తుతం ఓ బాలీవుడ్ హీరో కోసం అన్వేషిస్తున్నాడు.వంశీ పైడిపల్లి పరిస్థితి కూడా ఇంతే. వారసుడు వచ్చి రెండేళ్లయ్యింది. ఇప్పటికి తన సినిమా ఫైనల్ కాలేదు. తాను కూడా బాలీవుడ్ హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఈసారి పెద్ద ప్రాజెక్ట్ పట్టేట్టు కనిపిస్తోంది. అందుకే ఆలస్యమైనా వంశీ పైడిపల్లి పెద్దగా ఇబ్బంది పడడం లేదు. ‘విరాటపర్వం’ లాంటి మంచి సినిమా ఇచ్చిన వేణు ఉడుగుల కీ హీరో దొరకడం లేదు. తన దగ్గర ఇద్దరు ముగ్గురు నిర్మాతల అడ్వాన్సులు ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్‌లో ఓ సినిమా చేయాలి. హీరో సెట్ అయితే తప్ప.. ఏమీ చెప్పలేని పరిస్థితి.
సీరియర్ దర్శకులు పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల కూడా హీరోల వేటలోనే ఉన్నారు. పూరి ప్రస్తుతం ఓ కథ రెడీ చేస్తున్నారు. ఓ మాస్ హీరో కావాలి. శ్రీనువైట్ల ఓ కొత్త జోనర్ కథ ట్రై చేస్తున్నారు. ఆ కథ ఓ యంగ్ హీరోకి సెట్ అవుతుందట. వాళ్లు దొరికే వరకూ వీళ్ల ప్రాజెక్టులు ముందుకు కదలవు. కొరటాల శివ సైతం ఇప్పుడు ఓ హీరోని వెదుక్కోవాలి. ఆయన చేతిలో ‘దేవర 2’ ఉంది. అయితే అది ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఈలోగా ఓ సినిమా పూర్తి చేసే స్కోప్ ఉంది.