డ్రగ్స్ కేసు… కొంత కాలం క్రితం టాలీవుడ్‌ని గడగడలాడించింది. లిస్టులో చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. పూరి, ముమైత్‌ఖాన్ లాంటివాళ్లు సిట్ విచారణకు హాజరయ్యారు. గంటల తరబడి విచారణ జరిపి.. నెలల తరబడి ఈ కేసుని పరిశోధించిన ‘సిట్’ ఆ తరవాత.. ఆ కేసుని పక్కన పెట్టేసింది. ఇప్పుడు శ్రీనువైట్ల డ్రగ్స్ కేసుని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. అవును.. తన తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో ఇలాంటి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ ఉంటుందట. సినిమావాళ్లు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, సిట్ విచారణ, మీడియా చేసిన హంగామా.. ఇవన్నీ.. తెరపై సెటైరికల్‌గా చూపించాడట శ్రీనువైట్ల. వర్తమాన వ్యవహారాల్ని తెరపై సెటైరికల్ గా చెప్పడం శ్రీనువైట్ల స్టైల్. అవన్నీ బాగా కనెక్ట్ అయిపోతాయి కూడా. ఉదాహరణకు ‘దుబాయ్ శీను’లో సాల్మన్ రాజు పాత్ర గుర్తుండే ఉంటుంది. హీరోలపై శ్రీనువైట్ల వేసిన సెటైర్ అది. `ఈ పాత్ర ఫలానా హీరోని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిందే` అని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. `దూకుడు`లో రియాలిటీషోలపై పడ్డాడు శ్రీను. తను సెటైర్ వేసినప్పుడల్లా.. సీన్లు బాగా పండాయి. సినిమాలూ బాగా ఆడాయి. ఈసారి కూడా అదే పంథా పాటించినట్టు తెలుస్తోంది. ఇదే సినిమాలో తానా, ఆటాలపై సెటైర్లు వేస్తూ శ్రీనువైట్ల ఓ ఎసిసోడ్ రూపొందించాడని తెలుగు 360 ముందే చెప్పింది. ‘వాటా’ (ఓల్ ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్) పేరిట ఓ కామెడీ ట్రాక్ తెరకెక్కించాడు. ఇప్పుడు సిట్ విచారణపై తనదైన స్టైల్లో సెటైర్లు వేసి బాగా నవ్వించాడని తెలుస్తోంది. అన్నట్టు ఈ డ్రగ్స్ కేసులో అప్పట్లో రవితేజ పేరు కూడా వినిపించింది. అదే రవితేజ సినిమాలో ఇప్పుడు వాటిపై సెటైర్లు వేశాడంటే… శ్రీనువైట్ల ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే.