‘కంటెంట్ బావుంటే తెలుగు ప్రేక్షకులు ఏ భాషలో తెరకెక్కిన సినిమానైనా ఆదరిస్తారు’ ప్రమోషన్స్ లో ఇతర భాషల తారలు చెప్పే మాటిది. ఇది వంద శాతం నిజం. డబ్బింగ్ బొమ్మలుగా వచ్చి తెలుగులో కోట్లు గడించిన సినిమాలు చాలానే వున్నాయి. ఈ ఏడాది కూడా కొన్ని డబ్బింగ్ సినిమాలు జోరు చూపించాయి. ఇంకొన్ని నిరాశ పరిచాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి సినిమాలతో పాటు వచ్చింది విజయ్ ‘వారసుడు’. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా విడుదల పై పెద్ద వివాదమే నడిచింది. తెలుగు లో రెండు పెద్ద సినిమాలు వుండగా ఓ డబ్బింగ్ సినిమాకు ఎలా చోటిస్తారని పరిశ్రమలో కొందరు పెద్దలు పెదవి విరిచారు. అయితే దిల్ రాజు తన పట్టు నిలబెట్టుకున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో పాటే బాక్సాఫీసు ముందుకు వచ్చింది వారసుడు. అయితే ఇందులో కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు పెద్ద కిక్ ఇవ్వలేదు. వంశీ పైడిపల్లి తీసిన బృందావనం, మహర్షి చిత్రాలతో పాటు దాదాపు దిల్ రాజు పాత చిత్రాల ఫ్లేవర్ ఇందులో కనిపించింది. పైగా బాలకృష్ణ, చిరంజీవి లాంటి తెలుగు అగ్ర కథానాయకులు సినిమాలు థియేటర్స్ వుండటం, వాటికి హిట్ టాక్ రావడంతో వారసుడు పెద్ద ప్రభావాన్ని చూపించలేకపోయాడు. విజయ్ నంచి వచ్చిన మరో డబ్బింగ్ సినిమా ‘లియో’ తెలుగులో మంచి వసూళ్లే సాధించింది.
షారుక్ ఖాన్ కి ఈ ఏడాది భలే కలిసొచ్చింది. పఠాన్, జవాన్ లాంటి రెండూ వెయ్యికోట్ల సినిమాలే. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగులో కూడా ఈ రెండు సినిమాలు మంచి ఫలితాన్ని చూశాయి. ముఖ్యంగా మల్టీ ఫ్లెక్స్ లో షారుక్ సందడి బాగా కనిపించింది. మాస్ యాక్షన్ లార్జర్ దెన్ లైఫ్ కంటెంట్ ని ఇష్టపడుతున్న ఈ ట్రెండ్ లో ఈ రెండు సినిమాలు మంచి ప్రభావాన్ని చూపాయి. ఇక ఏడాది చివర్లో వచ్చిన ‘డంకీ’ మాత్రం తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ తో మరోసారి తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిజానికి ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా వచ్చింది. తెలుగులో ఏ మాత్రం ప్రచారం చేయలేదు. అయితే ‘నువ్ కావాలయ్య’ పాట వైరల్ హిట్ కావడంతో ఒక్కసారిగా జైలర్ పేరు మార్మ్రోగింది. జైలర్ కంటెంట్ కూడా ప్రేక్షకులకు నచ్చింది. రజనీకాంత్ వయసుతగ్గ పాత్ర చేశారని, దర్శకుడు నెల్సన్ రజనీని తెరపై చూపించిన తీరు బావుందని ప్రశంసలు దక్కాయి. నిజానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ డల్ అయ్యింది. కానీ శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కెమియో ఎంట్రీలు భలే వర్క్ అవుట్ అయ్యాయి. వెరసి చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో రజనీ సినిమా ప్రభావాన్ని చూపించింది.
రణబీర్ కపూర్ ‘యానిమల్’ తెలుగు ఆడియన్స్ ద్రుష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. సందీప్ రెడ్డి వంగా మార్క్ లో టీజర్ ట్రైలర్ సినిమాలో ఆసక్తి పెంచాయి. మహేష్ బాబు, రాజమౌళి లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో బాగం కావడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఆ హైప్ కి తగ్గట్టే సినిమా కంటెంట్ కూడా యూనిక్ గా సాగింది. యానిమల్ రన్ టైం మొదట్లో కాస్త భయపెట్టిన.. ప్రేక్షకులు మాత్రం దాని గురించి కంప్లయిట్ లేకుండా చూశారు. ‘యానిమల్’ వైల్డ్ యాక్షన్ కి బాగానే కనెక్ట్ అయ్యారు.
మణిరత్నం కలల ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. క్రాఫ్ట్ పరంగా ఈ చిత్రం మణిరత్నం స్థాయిలో ఉన్నప్పటికీ ఇందులో కంటెంట్ పూర్తిగా తమిళుల చరిత్ర. అందులో పాత్రలు, సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులపై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు.
ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’. బాక్సాఫీసు వద్ద కూడా డీసెంట్ రిజల్ట్ చూసింది. కేరళ వరదల ఆధారంగా వచ్చిన మలయాళ చిత్రం “2018” తెలుగలో కూడా మంచి ప్రసంశలు అందుకుంది. తెలుగులో లిమిటెడ్ గా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. డబ్బింగ్ నిర్మాతలకు ఇది తృప్తిని ఇచ్చిన చిత్రమే. అలాగే విజయ్ అంటోని ‘బిచ్చగాడు 2’ ఫ్రాంచైజ్ పై ఆసక్తిని నిలుపుకొనే విజయాన్ని అందుకుంది. సిద్దార్థ్ స్వయంగా నిర్మించిన ‘చిన్నా’ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్ద ప్రభావాన్ని చూపనప్పటికీ సమాజానికి అవసరమైన సినిమానే ప్రసంశలు అందుకుంది.
కన్నడ సూపర్ స్టార్లు శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ డిజాస్టర్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ ‘కింగ్ అఫ్ కొత్త’ కూడా ఫ్లాఫ్ బాటపట్టింది. కార్తి ‘జపాన్’ నిరాశపరిచాడు. విశాల్ ‘మార్క్ అంటోనీ’, లారెన్స్ ‘జిగర్ తాండ2’, ‘చంద్రముఖి 2’, శివ కార్తికేయన్ ‘మహావీరుడు’ చిత్రాలు తెలుగులో రాణించలేకపోయాయి. మంచి ప్రేమకథగా కన్నడలో పేరు తెచ్చుకున్న ‘సప్తసాగరాలు’ ఇక్కడ ప్రేక్షకుల దృష్టిని ఏ మాత్రం ఆకర్షించలేకపోయింది. చిన్న సినిమాగా వచ్చిన ‘బాయ్స్ హాస్టల్’ మాత్రం యూత్ కి కనెక్ట్ అయ్యింది.