గుళ్లో గంటలా..
పూజ గదిలో గుభాళించే కర్పూరంలా..
తెలుగింటి ముత్తైదువలా
మసీదులోంచి వచ్చే దువాలా
క్రైస్తవుడి దీవెనలా
ఎంత పవిత్రంగా కనిపించేదో!
ఇక సినిమా వాడికా..
ఆరోజు పండగే!
నిద్ర మొహంతోనే `సినిమా టాకేంటో`
అని సెల్ఫోనుల్లో దూరి
లైవ్ అప్ డేట్లకోసం వెదికే
ఆ శుక్రవారం ఎప్పుడొస్తుందో..?
హిట్టు
సూపర్ హిట్టు
బ్లాక్ బ్లస్టరు… ఈ మాటలెప్పుడు
వినిపిస్తుందో…?
మామా.. మాట్నీకెళ్దాం వస్తావా,
ఓ టికెట్టు కావాల్రా..
రివ్యూ ఏంటి? రేటింగెంత?
రికార్డు బ్రేకేనా..
– ఇలా ఎప్పుడు మాట్లాడుకుంటామో..?
గర్వాన్ని నేలకు దించేదానివి
ప్రతిభకు రెడ్ కార్పేట్ పరిచేదానివి!
అనూహ్యాలూ
ఆశ్చర్యాలూ
హహాకారాలూ
అద్భుతాలూ..
నీలో ఎన్ని కోణాలుండేవో..?
థియేటర్ ముందు క్యూలో నిలబడడం
టికెట్టు కోసం కలబడడం
చివరికి అది దక్కితే.. విజయగర్వంతో
ప్రపంచాన్ని గెలిచినంత సంబరంతో
కాలర్ ఎగరేయడం..
మళ్లీ ఈ రోజు ఎప్పుడు చూస్తామో..?
ఓ శుక్రవారమా.. నువ్వెప్పుడొస్తావ్???
ఓ శుక్రవారమా?
ఒక్క రోజులోనే ఎన్ని జీవితాలు మలుపు తిప్పేదానివో?
ఎన్ని కలలకు పిల్లల్నికనేదానివో..?
ఎన్ని ఆశలకు చిగుర్లు తొడిగే దానివో..?
ఎన్ని కథలకు రెక్కలిచ్చేదానివో..?
మళ్లీ.. నువ్వెప్పుడొస్తావ్?