సంక్రాంతి తరవాత కూడా బాక్సాఫీసు దగ్గర సినిమాల హవా కనిపిస్తోంది. చిన్నవో… పెద్దవో ప్రతీవారం గుంపుగా సినిమాలు రావడం కామన్ అయిపోయింది. ఈవారం కూడా దాదాపు అరడజను చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. వాటిలో ‘సుందరం మాస్టారు’ ఒకటి. హాస్యనటుడు వైవా హర్ష ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఓ గూడెంలో జరిగే కథ ఇది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొంటున్నాయి. కామెడీ టచ్‌తో పాటు ఎమోషన్ కూడా వర్కవుట్ అయితే, వైవా హర్ష హీరోగానూ మెప్పించేస్తాడు.
ఈవారం విడుదల అవుతున్న సినిమాల్లో కాస్త బజ్ సంపాదించుకొన్న సినిమా `సిద్దార్థ్ రాయ్`. ఈ సినిమాతో బాలనటుడుగా గుర్తింపు తెచ్చుకొన్న దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. టీజర్, ట్రైలర్ మంచి ఇంపాక్ట్ ఇచ్చాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వైబ్స్ కనిపించాయి. దాంతో కుర్రాళ్లు ఈ సినిమాపై దృష్టి పెట్టారు. ఈవారం చాలా సినిమాలే వస్తున్నా, టికెట్లు తెగే అవకాశాలు ఈ సినిమాకే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు యశస్వీ.. తొలి సినిమా విడుదల కాకుండానే సుకుమార్ బ్యానర్లో ఓ సినిమా చేసే ఛాన్స్ దక్కించుకొన్నాడు. దాంతో.. ‘సిద్దార్థ్ రాయ్‌లో’ ఏదో ఉందన్న కుతూహలం మరింత ఎక్కువైంది. హాస్య నటుడు అభినవ్ గోమఠం హీరోగా మారి చేసిన సినిమా ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ ‘.. ఈనెల 23న వస్తోంది. వీటితో పాటుగా ‘ముఖ్య గమనిక’, ‘సైరన్’, ‘ఆర్టికల్ 370’ విడుదలకు రెడీ అయ్యాయి. గత వారం విడుదలైన ‘ఊరి పేరు భైవరకోన’కూడా ఈ వీకెండ్ లో తన ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వారాంతంలో ప్రేక్షకులకు వినోదానికి కొదవ లేదనే చెప్పాలి.