గతవారం సినిమాల గురించి మాట్లాడుకొనేలోపే.. అప్పుడే మరో శుక్రవారం వచ్చేస్తోంది. ఈవారం బాక్సాఫీసు ముందుకు ఓ పెద్ద సినిమా, రెండు చిన్న సినిమాలు వినోదం పంచడానికి రెడీ అయ్యాయి. ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘చారి 111’, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో అందరి చూపూ.. వరుణ్ సినిమాపైనే.
వరుణ్ తేజ్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇండియన్ ఎయిర్ఫోర్స్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. పుల్వామా దాడికి భారత్ పాకిస్థాన్ పై ఎలా ప్రతీకారం తీర్చుకొంది? అనే పాయింట్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. దేశభక్తి, యాక్షన్, ఎమోషన్.. ఇవన్నీ మేళవించిన సినిమా ఇది. దీనిపై వరుణ్ భారీగా ఆశలు పెట్టుకొన్నాడు. దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నాడు. హిందీ వెర్షన్ కోసం తనకు తానే డబ్బింగ్ చెప్పుకొన్నాడు. వరుణ్ ఖాతాలో ప్రయోగాత్మక చిత్రాలు చాలా ఉన్నాయి. అయితే అవి పెద్దగా కమర్షియల్ విజయాల్ని అందించలేదు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
ఈ వారం ఇద్దరు జేమ్స్ బాండ్ లు వినోదం పంచడానికి సిద్దమయ్యారు. వెన్నెల కిషోర్ నటించిన ‘చారి 111’ ఈ వారం వస్తోంది. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా అంతా తన భుజాలపై వేసుకొని లాగించగల సమర్థుడే. జేమ్స్ బాండ్ తరహా కథ కాబట్టి.. ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. కమెడియన్లు హీరోలుగా భారీ సక్సెస్లు కొట్టిన చరిత్ర మనకు ఉంది. ఈసారి వెన్నెల కిషోర్ ఏం చేస్తాడో చూడాలి. ఈవారం వస్తున్న మరో జేమ్స్ బాండ్ సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. శివ కందుకూరి హీరోగా నటించిన ఈ చిత్రానికి పురుషోత్తం దర్శకుడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. ఓ మిస్టరీకి థ్రిల్లర్, సస్పెన్స్ జోడించిన సినిమా ఇది. మరి ఈ మూడు చిత్రాల్లో ప్రేక్షకుల ఓటు దేనికో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.