గతవారం బాక్సాఫీసు ముందుకు 8 సినిమాలొచ్చాయి. అయితే ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్’ ఒక్కటే కాస్త సౌండ్ చేసింది. మిగిలిన సినిమాలన్నీ నామ్ కే వాస్తే అన్నట్టు వచ్చి వెళ్లిపోయాయి. ఈ వారం 4 సినిమాలొస్తున్నాయి. నాలుగింటిపైనా రకరకాల కారణాల వల్ల మంచి బజ్జే ఏర్పడింది.
8న ‘యాత్ర 2’ వస్తోంది. ‘యాత్ర’కు కొనసాగింపు ఇది. మహి.వి.రాఘవ దర్శకుడు. ఇదో పొలిటికల్ డ్రామా. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం దారి తీసిన పరిస్థితులు, వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రిగా గెలవడం ఇదీ.. మూల కథ. అయితే ఈ కథలో ఎన్ని నిజాలున్నాయో, ఎన్ని అబద్ధాల్ని అందంగా చూపించారో సినిమా చూస్తే కానీ తెలీదు. ‘యాత్ర’లో స్టార్ కాస్ట్ బలంగా కనిపించింది. అయితే ‘యాత్ర 2’లో ఆ లక్షణాలేం లేవు. జీవాకు తెలుగులో మార్కెట్ లేదు. వైకాపా సపోర్టర్లు ఈ సినిమా చూస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ప్రచార పర్వం మాత్రం అంతంత మాత్రంగానే నడుస్తోంది.
9న ‘ఈగల్’, ‘లాల్ సలామ్’ వస్తున్నాయి. రవితేజ ‘ఈగల్’ సంక్రాంతికే రావాల్సింది. సోలో రిలీజ్ ఆశతో ఇప్పటి వరకూ ఆగింది. అయితే ఈసారి కూడా పోటీ తప్పలేదు. రవితేజ ఈ సినిమాపై సూపర్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టింది. ఈవారం విడుదల అవుతున్న సినిమాల్లో కమర్షియల్ గా నిలబడే సత్తా ఈ సినిమాకే ఉంది. ‘లాల్ సలామ్’పై రజనీ ఫొటో కనిపిస్తున్నా, ఈ సినిమాలో ఆయనది గెస్ట్ పాత్ర అని సమాచారం. ఐశ్వర్య దర్శకత్వం వహించారు. కథ, కథనాల పరంగా ఇదో సీరియస్ డ్రామా అని తెలుస్తోంది.
10న ‘ట్రూ లవర్’ వస్తోంది. ఇదో డబ్బింగ్ సినిమా. అయితే పోస్టర్‌పై మారుతి, ఎస్కేఎన్ పేర్లు కనిపిస్తున్నాయి. వీళ్ల కాంబోలో ‘బేబీ’ వచ్చిన సంగతి తెలిసిందే. ‘ట్రూ లవర్’ కూడా బేబీ లాంటి లవ్ స్టోరీనే. ట్రైలర్ ఆకట్టుకొంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.