హైదరాబాద్: సంక్రాంతికి విడుదలవుతున్న టాలీవుడ్ సినిమాల విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. పెద్ద పండగకు నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నాన్నకు ప్రేమతో 13న, డిక్టేటర్ 14న, సోగ్గాడే చిన్ని నాయనా 14న, ఎక్స్‌ప్రెస్ రాజా 14న విడుదల కాబోతున్నాయి. నాన్నకు ప్రేమతో సంక్రాంతికి రిలీజ్ అవటం కష్టమని కొందరు, డిక్టేటర్ విడుదల వాయిదా పడుతుందని కొందరు అన్నప్పటికీ ఆ రెండు సినిమాలూ సంక్రాంతికి విడుదలవటం ఖాయమని సదరు చిత్రాల నిర్మాతలు ప్రకటించేశారు. దీనితో బాబాయ్-అబ్బాయ్‌ల వార్ అనివార్యమని తేలింది. డిక్టేటర్ రీరికార్డింగ్ తమన్ స్టూడియో చెన్నై వరదల్లో దెబ్బ తినటంతో ఆగిపోగా మణిశర్మతో చేయించి మరీ సంక్రాంతికి రెడీ చేయిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. మరోవైపు నాగార్జున తన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మనం విడుదలై సంవత్సరమున్నర కావటంతో ఈ చిత్రం రిలీజ్‌కు ఇదే సరైన సమయమని నాగార్జున భావించారని చెబుతున్నారు. మరోవైపు ఆయన ఊపిరి చిత్రం కూడా పూర్తయ్యి ఉన్నందున ఇది విడుదలైతేగానీ దానిని గ్యాప్ ఇచ్చి త్వరగా విడుదల చేయటానికి అవకాశముండదు. ఇదిలా ఉంటే మిర్చి, రన్ రాజా రన్, భలే భలే మగాడివోయ్ చిత్రాలను నిర్మించిన యూవీ క్రియేషన్స్వారి ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రం కూడా సంక్రాంతి రేసుకు సిద్ధమయింది. వరుస విజయాల బ్యానర్ కావటంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. నాన్నకు ప్రేమతో చిత్రం ట్రైలర్ బాగా ఆకట్టుకోవటంతో దానిపై అంచనాలు విపరీతంగా బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్లో ఎన్ని చిత్రాలు వచ్చినా బాగుంటే అన్నీ ఆడటానికి అవకాశం ఉంటుంది. మరి ఈ నాలుగు చిత్రాలలో ఎన్ని విజయవంతమవుతాయో, ఎన్ని ఇంటికెళతాయో చూడాలి.
మరోవైపు తమిళంలో కూడా పొంగల్‌కు 4 సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. విశాల్ నటించిన కథాకళి, ప్రస్తుతం మంచి రైజింగ్‌లో ఉన్న వర్ధమాన హీరో శివకార్తికేయన్ చిత్రం రజినీ మురుగన్, ఉదయనిధి స్టాలిన్ నటించిన గెతు, సంచలన చిత్రాలకు మారుపేరైన బాల దర్శకత్వంలో వస్తున్న తరై తప్పట్టై సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నాయి.