ఈ వేసవి టాలీవుడ్ కి కలిసి రాలేదు. వేసవిలో పెద్ద సినిమాలు రావాలి. పండక్కి రాలేకపోయిన సినిమాలు వేసవి బరిలో దిగుతుంటాయి. కానీ ఈ వేసవి ఆ ప్లానింగ్ తప్పింది. సమ్మర్ లో పెద్ద సినిమాలు సందడి లేకపోగా వచ్చిన మీడియం, చిన్న సినిమాలు పెద్దగా విజయాలని అందుకోలేకపోయాయి.
మార్చిలో బలగం, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, ఫలానా అబ్బాయి, కబ్జా, దాస్ కా ధమ్కీ, రంగమార్తాండ, దసరా.. సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో బగలం సినిమాకి మంచి పేరు వచ్చింది. రంగమార్తాండ కి కూడా మంచి పేరు వచ్చింది కానీ థియేటర్లో ఎవరూ చూడలేదు. దసరా సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు కానీ అది కేవలం తెలంగాణకే పరిమితమైయింది. ఈ ఏరియాలో తప్పా మిగతా ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. మిగతా సినిమాలన్నీ నిరాశ పరిచాయి.
ఏప్రిల్ లో రవితేజ రావణాసుర, కిరణ్ అబ్బవరం మీటర్, శాకుంతులం, విడుదల 1, విరూపాక్ష ఏజెంట్, పోన్నియన్ సెల్వన్ 2 సినిమాలు వచ్చాయి. ఇందులో విరూపాక్ష తప్పితే మిగతా సినిమాలు ప్రభావం చూపలేదు. డబ్బింగ్ సినిమాలు విడుదల, పోన్నియన్ 2 తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. రవితేజకు రావణాసుర రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అఖిల్ ఏజెంట్ అయితే తీవ్రంగా నిరాశ పరిచింది. శాకుంతులం పరిస్థితి మరీ దారుణం. ఆదరణలోనే కాదు సినిమా చిత్రీకరణ పరంగా కూడా విమర్శలు ఎదురుకుంది.
‘మే’ నెల కూడా ఇప్పటివరకూ చాలా నిరాసంగా వుంది. రామబాణం డిజాస్టర్ అయ్యింది. ఉగ్రం సినిమా తేలిపోయింది. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన ‘కస్టడీ’ సినిమా కూడా దెబ్బకొట్టింది. మంచి సినిమాలు తీస్తారనే పేరున్న స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్ నుంచి వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ పరాజయం బాట పట్టింది. ఈ వారం మేమ్ ఫేమస్, మళ్ళీ పెళ్లి లాంటి చిన్న సినిమాలు వస్తున్నాయి. ఈ రెండిటిపై పెద్ద అంచనాలు ఏమీ లేవు. మొత్తానికి ఈ వేసవి పెద్ద సినిమాలు సందడి లేక, వచ్చిన సినిమాలు కూడా దాదాపు అపజయాలు మూటకట్టుకున్నాయి.