ఓ విషయంలో తెలుగు పరిశ్రమని మెచ్చుకొని తీరాలి. ఎలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినా, మేమున్నాం అంటూ ముందుకొస్తారు. తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కరోనాపై పోరాటానికి ఇప్పటికే భారీ ఎత్తున విరాళాలు ప్రకటించింది టాలీవుడ్. ఇప్పుడు మరో గొప్ప ముందడుగు వేసింది. సీసీసీ (కరోనా క్రైసెస్ చారిటీ) అనే సంస్థని స్థాపించింది. దీని ద్వారా పేద సినీ కళాకారుల్ని ఆదుకోబోతోంది. సినీ తారలు ప్రకటించిన విరాళాల్ని ఈ సంస్థ ఓ చోట చేర్చి దాన్ని క్రమ పద్ధతిలో కొన్ని కార్యక్రమాల ద్వారా సినీ కార్మికులకు చేయూత నివ్వడానికి ఖర్చు చేయనుంది. ఈ సీసీసీకి చిరంజీవి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. తమ్మారెడ్డి భరద్వాజా, సి.కల్యాణ్, ఎన్.శంకర్, సురేష్ బాబు, దామూ కీలక సభ్యులుగా వ్యవహరిస్తారు. ఫెడరేషన్‌కు సంబంధించిన అన్ని సేవా సంఘాలూ వీటిలో భాగస్వామ్యం పంచుకుంటాయి. చిరంజీవి ప్రకటించిన రూ.1 కోటి వితరణ కూడా సీసీసీ ద్వారానే ఖర్చు చేస్తారు. తాజాగా నాగార్జున రూ.1 కోటి ప్రకటించారు. రామ్ చరణ్ సీసీసీ కోసం రూ.30 లక్షలు ప్రకటించారు. మహేష్ బాబు కూడా అదనంగా మరో 25 లక్షలు అందజేయనున్నారు.
నిజంగానే ఇదో మంచి అడుగు. చిత్రసీమ అంటే.. హీరోలు, దర్శకులు, నిర్మాతలే కాదు. అట్టడుగున పనిచేసే శ్రామికులు కూడా. లైట్ బోయ్స్ దగ్గర్నుంచి కెమెరా అసిస్టెంట్స్ వరకూ..ఎంతోమంది చమటోడిస్తే గానీ సినిమా తయారవ్వదు. అలాంటి కార్మికుల కాలే కడుపుల్ని నింపాల్సిన బాధ్యత పరిశ్రమకు ఉంది. కాకపోతే.. అదెంత పటిష్టంగా పనిచేస్తుందన్నది చూడాలి.