ఎన్నికలు అయిపోయాయి. రిజల్ట్ వచ్చేసింది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వడమే తరువాయి. కాబట్టి జనాల దృష్టి మెల్లమెల్లగా ‘రాజకీయాలు’ నుంచి టర్న్ అవుతోంది. ఇప్పుడు సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే తెలుగులో కొత్త సినిమాల విడుదల జోరందుకొంది. ఈవారం అయితే ఏకంగా 6 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 14న వస్తోంది. కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇది. సుధీర్‌బాబుతో పాటు మిగిలిన పాత్రలన్నీ చిత్తూరు యాసలోనే మాట్లాడతాయి. యాక్షన్ కి పెద్ద పీట వేశారు. సునీల్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇదే రోజున విజయ్ సేతుపతి నటించిన ‘మహరాజ’ తెలుగులో వస్తోంది. విజయ్‌సేతుపతికి ఇది 50వ సినిమా. ట్రైలర్ చూస్తే మంచి కాన్సెప్ట్ తో కూడిన థ్రిల్లర్ అనిపిస్తోంది. చాందిని చౌదరి ప్రధాన పాత్ర పోషించిన ‘యేవమ్’ కూడా ఇదే రోజు వస్తోంది. చాందిని అనగానే సాఫ్ట్ క్యారెక్టర్లు గుర్తొస్తాయి. అయితే ఈ సినిమాలో ఆమె యాక్షన్ బరిలో దిగింది. క్రైమ్ చుట్టూ నడిచే కథ ఇది. చాందినికి సరికొత్త ఇమేజ్ ఇస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ‘ఇంద్రాణి’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం కూడా ఈవారమే వస్తోంది. దాంతో పాటు యష్ నటించిన డబ్బింగ్ సినిమా ‘రాజధాని రౌడీ’ పేరుతో ఈ వారమే రానుంది. ‘కేజీఎఫ్’ క్రేజ్ వాడుకోవాలన్న ఉద్దేశం నిర్మాతలో కనిపిస్తోంది. అందుకే ఎప్పటి సినిమానో ఇప్పుడు డబ్ చేశారు. క్యారెక్టర్ నటుడు అజయ్ ఘోష్ తొలిసారి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. చాందిని చౌదరి కథానాయికగా నటించింది. లేటు వయసులో డీజే అవ్వాలని కోరుకొన్న ఓ వ్యక్తి కథ ఇది. కాన్సెప్ట్ వరకూ బాగుంది. మరి తీత ఎలా ఉందో చూడాలి.