2018 చివరికి వచ్చేశాం. డిగ్రీ ఫైనల్ ఇయర్లో బ్యాక్ లాగ్లన్నీ పూర్తి చేయాలని విద్యార్థులు ఎలా కసరత్తులు చేస్తారో… కొత్త యేడాది మొదలయ్యేలోగా చేతిలో ఉన్న సినిమాలన్నీ విడుదల చేసేసుకోవాలని నిర్మాతలూ అలానే తపన పడతారు. అందుకే… డిసెంబరులోగా చిన్నా చితకా సినిమాలన్నీ కలుపుకుని దాదాపు పాతిక వరకూ ఉన్నాయి. ఒక్క డిసెంబరు 21నే 4 సినిమాలు రాబోతున్నాయి. పడి పడి లేచె మనసు, అంతరిక్షం, యాత్ర, కాంచన 3 డిసెంబరు 21న విడుదలకు సిద్ధమయ్యాయి.
పడి పడి లేచె మనసు, అంతరిక్షం సినిమాలపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. యాత్ర రాజకీయ పరమైన సినిమా కాబట్టి.. దానిపైనా ఫోకస్ పడుతుంది. కాంచన, కాంచన 2 తెలుగులో బాగా ఆడాయి. సో… ఈ మూడో భాగం కూడా చూడదగినదే. అలా.. నాలుగు సినిమాలూ జోరుమీదే ఉన్నాయి. డిసెంబరు 21 దాటితే… ఆయా చిత్రాలకు థియేటర్లు దొరకడం కష్టం. ఈ డేట్ తప్పితే.. సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ 21నే రావాలని ఫిక్సయ్యారు.
అయితే ఇక్కడ ప్రధానమైన ఇబ్బంది డిస్టిబ్యూటర్ల నుంచే. వాళ్లెవరూ ఈ సినిమాలకు డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేరు. కావాలంటే చిన్న మొత్తాల్లో అడ్వాన్సులు ఇస్తాం.. దాంతో సరిపెట్టుకోండి అంటున్నారు. దానికీ ఓకారణం ఉంది. ఈ సినిమాలన్నీ అన్ సీజన్లో విడుదల అవుతున్నాయి. పైగా నాలుగు సినిమాలూ ఒకేసారి వస్తాయి. సంక్రాంతికి బరిలో సినిమాల కోసం అడ్వాన్సులు కట్టి రెడీగా ఉన్న బయ్యర్లు.. మళ్లీ ఈ సినిమాలకు డబ్బులు తెచ్చుకోలేరు. `అందుకే.. మీకు నమ్మకం ఉంటే సినిమాలు విడుదల చేసుకోండి.. లేదంటే లేదు` అని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇబ్బంది అంతా నిర్మాతలకే. ఎందుకంటే తక్కువ మొత్తాలకే సినిమాని వదులుకోవాలి. లేదంటే సొంతంగా విడుదల చేసుకోవాలి. ఈ నాలుగు సినిమాలూ సొంతంగా విడుదల కాలేవు. బయ్యర్ల చేతిలో పెట్టాల్సిందే. వాళ్లేమో… వివిధ కారణాలతో అడ్వాన్సులు ఇచ్చుకోలేం అంటున్నారు. అలా.. డిసెంబరు 21న రాబోయే సినిమాల ఈ నాలుగు సినిమాలూ సంక్షోభంలో పడినట్టైంది. ఒకట్రెండు సినిమాలు వాయిదా పడితే ఈ పరిస్థితిలో మార్పు రావొచ్చు.