వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకొంది. ఈ శుక్రవారం `సీతారామం`, `బింబిసార` చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు సినిమాలూ పాజిటీవ్ రివ్యూల్ని సంపాదించుకొన్నాయి. `సీతారామం` క్లాస్ కి నచ్చితే, మాస్ ఓటు `బింబిసార`కు పడింది. శుక్రవారం మార్నింగ్ షోలు.. రెండింటింకీ ఏవరేజ్గానే ఓపెన్ అయినా ఫస్ట్ షో, సెకండ్ షో నాటికి బుకింగ్స్ ఊపందుకొన్నాయి. మొత్తానికి తొలి రోజు.. రెండింటికీ పాజిటీవ్గానే గడిచింది. శని, ఆదివారాలు.. ఇదో జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమాలకూ రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాకపోవొచ్చు. కానీ.. ఈ ఓపెనింగ్స్ కాస్త ఊరట నిచ్చిన విషయాలు. టికెట్ రేట్లు బాగా తగ్గించడం, దాంతో పాటు.. రివ్యూలు బాగా రావడంతో ఈ రెండు సినిమాల వైపూ మొగ్గు చూపించారు ప్రేక్షకులు. వర్షాలు తగ్గి, కాస్త థియేటర్లకు వెళ్లగలిగే వాతావరణం కనిపిస్తోంది. ఇది కాస్త ఊరట నిచ్చే విషయం. వచ్చే వారం `మాచర్ల నియోజక వర్గం`, `కార్తికేయ 2` సినిమాలు వస్తున్నాయి. వాటికి ఈవారం వసూళ్లు కాస్త బూస్టప్ ఇస్తాయడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే వారం కూడా ఇదే జోరు కొనసాగితే.. ఆగస్టు 25న రాబోతున్న `లైగర్`కి మరింత ఉత్సాహం అందుతుంది. ఈ నెలంతా బాక్సాఫీసు దగ్గర ఈ హంగామా కనిపిస్తే – కొంతలో కొంత టాలీవుడ్ తేలుకొన్నట్టే లెక్క.