జాతీయ అవార్డులు కానివ్వండి, పద్మశ్రీలు కానివ్వండి…. లాబీయింగులపైనే వస్తుంటాయి. ఇది కాదనలేని సత్యం. మన దగ్గర టాలెంట్ ఉండొచ్చు. కానీ ‘వీళ్లకు అవార్డులు ఇవ్వాల్సిందే’ అని పట్టుబట్టి మరీ తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం దాపరించింది. గతంలో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టి.సుబ్బిరామిరెడ్డి లాంటి వాళ్లు… ఢిల్లీలో కూర్చుని, మనవాళ్లకు అవార్డులు రాబట్టడంతో విజయం సాధించారు. ఈ విషయాన్ని సినీ పెద్దలు సైతం ఒప్పుకుంటారు. అలా.. ఇప్పుడు ఢిల్లీలో మన తరపు మాట్లాడే నాధుడే లేడు.
కేంద్రం ఎప్పటిలానే పద్మ అవార్డుల్ని ప్రకటించింది. అందులో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పేర్లు కనిపించలేదు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ఎందుకంటే ముందు నుంచీ.. తెలుగువాళ్లంటే చిన్నచూపే. అది ఈసారి ఇంకాస్త ఎక్కువగా కనిపించిందంతే. నిజానికి పద్మ పురస్కారాల ఎంపిక రాష్ట్రాల చేతుల్లో లేని విషయం. రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు మాత్రమే చేయగలరు. ఈసారి సిఫార్సులు కూడా అంతగా వెళ్లలేదన్నది విశ్వసనీయ వర్గాల భోగట్టా.
రాష్ట్రం రెండుగా విడిపోవడం తెలుగు చిత్రసీమకు గట్టి దెబ్బలా మారింది. ఎప్పుడైతే తెలుగు ప్రజలు ముక్కలయ్యారో, అప్పటి నుంచీ టాలీవుడ్ ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. నంది అవార్డులు అటకెక్కాయి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందనుకున్న సింహా అవార్డుల ఊసే లేదు. భవిష్యత్తులోనూ ఇస్తారన్న గ్యారెంటీ లేదు. మళ్లీ మళ్లీ అడిగితే సినిమా వాళ్లని ఎందుకు పట్టించుకోవాలి? అనే మాటే వినిపిస్తుంటుంది.
టీడీపీ ప్రభుత్వం హయాంలో పద్మలు బాగానే వచ్చాయి. ఎందుకంటే చిత్రసీమ మొత్తం టీడీపీని అనుకూలంగా ఉండేది. పెద్ద పెద్దవాళ్లంతా ఆ పార్టీవాళ్లే. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిత్రసీమలోని పెద్దలెవ్వరూ ఆయన్ని కలవలేదని, శుభాకాంక్షలు చెప్పలేదని బాహాటంగానే అక్కసు వెలిబుచ్చారు వైకాపా నాయకులు. నిజానికి జరిగింది కూడా అదే. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మాట వరసకైనా చిత్రసీమ నుంచి ఓ బృందం ఆయన్ని కలవడం గానీ, తమ సమస్యల గురించి చెప్పుకోవడం గానీ జరగలేదు. అలాంటప్పుడు ఆయనెందుకు టాలీవుడ్ ని పట్టించుకుంటాడు..? పైగా టాలీవుడ్ ఆంధ్రదా? తెలంగాణదా? పరిశ్రమ ఇక్కడే ఉంటుందా? విశాఖ తరలిపోతుందా? ఇలా రకరకాల డౌట్లు. అందుకే ఏ ప్రభుత్వానికీ చెందకుండా పోయింది. పద్మశ్రీ సిఫార్సు చేయాల్సివచ్చినప్పుడు కూడా ప్రాంతాల గొడవే ఎక్కువగా కనిపిస్తుంటుంది. చిత్రసీమకు చెందినవాళ్లని హైదరాబాద్ వాళ్లుగా గుర్తించాలా? లేదంటే వాళ్లు పుట్టిన చోటికే ప్రాధాన్యం ఇవ్వాలా? అనేది పెద్ద డౌటు. అందుకే.. సిఫార్సులు కూడా తగ్గిపోయాయి.
ఇక తెలంగాణ ప్రభుత్వం సంగతే వేరు. కేసీఆర్ చేతిలో ఉన్న బలమైన మెజారిటీ, ప్రజల అభిమానం దృష్ట్యా.. `అసలు మేం టాలీవుడ్ ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు` అన్నట్టు తయారైంది ఆయన వైఖరి. కొత్త సినిమాలు విడుదల సమయంలో అదనపు ఆటలు ప్రదర్శించుకునే అవకాశం అడిగితేనే ఇవ్వడం లేదు. బెనిఫిట్ షో లు పడడం లేదు. ఇక సింహాలూ, పద్మశ్రీల గురించి ఆలోచించడం ఎందుకు?
తెలుగువాళ్లు రెండుగా విడిపోయినందుకు ఎవరెవరు ఎంతెంత లాభపడ్డారో తెలీదు గానీ, అవార్డుల విషయంలో మాత్రం తెలుగువారికి అన్యాయం జరుగుతోందన్నది నిజం. రాజకీయాలనూ, స్థానికతనూ పక్కన పెట్టి – రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే గానీ, టాలీవుడ్‌కి అవార్డుల కళ రాదు.