2023 టాలీవుడ్ కి మరపురానిది. తెలుగులోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే మరపురాని ఘట్టం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం ఈ ఏడాది పరిశ్రమకి దక్కింది. అలాగే ఎన్నో ఏళ్ళుగా తెలుగు నటుడు కన్నకల ఈ ఏడాదే నిజమైయింది. ఒక్కసారి ఆ మెరుపుల్లోకి వెళితే..
తన చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలకూ వ్యాపింపజేసిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమాకు కలగానే మిగిలిపోందునుకునే ఆస్కార్ ని మన దేశానికి తెచ్చాడు. 2022లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబ్టటింది. హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ సైతం ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు… పాట ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. విడుదలైన నాటి నుంచే అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ పాట ఆస్కార్ అవార్డును అందుకొని చరిత్ర సృష్టించింది. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డ్ అందుకోవడం, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాటని వేదికపై ఆలపించడం తెలుగు ప్రేక్షకులకు ఒక ఉద్విగ్న క్షణం. నాటు నాటు పాటకు అందిన మరో విశిష్ట పురస్కారం..గోల్డెన్ గ్లోబ్. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగానికి గానూ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాటకు పురస్కారం వరించింది. వీటితో పాటు సినీ క్రిటిక్స్ అవార్డ్ ని అందుకొని తెలుగు సినిమా సత్తాని చాటింది.
అవార్డుల పరంగా చూసుకుంటే 2023 తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ అని చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతని అల్లు అర్జున్ సాధించారు. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచాడు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పరంగానే కాకుండా… జాతీయ అవార్డ్స్ లోనూ తగ్గేదేలే అని చాటాడు పుష్ప. జాతీయ అవార్డ్ కోసం పలు భాషల నుంచి అగ్ర హీరోలు పోటీపడ్డారు. తెలుగు నుంచే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ గట్టిపోటీని ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ కే పురస్కారం వరిచింది. దీంతో జాతీయ అవార్డ్ అందుకున్న ఒక్కే ఒక్క తెలుగు నటుడిగా చరిత్ర సృస్టించాడు అల్లు అర్జున్.
అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ఏడాది జాతీయ అవార్డులని అందుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’కు గానూ రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా కీరవాణి (ఆర్ఆర్ఆర్), ఉత్తమ యాక్షన్ డైరెక్టర్‌గా కింగ్ సాలమన్(ఆర్ఆర్ఆర్), ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విభాగంలో ప్రేమరక్షిత్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాలభైరవ (ఆర్ఆర్ఆర్) ఉత్తమస్పెషల్ ఎఫెక్ట్స్‌కి శ్రీనివాస మోహన్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ గీత రచనకు చంద్రబోస్ (కొండపొలం), అవార్డులు సొంతం చేసుకున్నారు. 2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. అలా 2023ని చరిత్రలో నిచిలిపోయేలా చేశాయి ఈ చిత్రాలు.