2020… ప్రపంచంతో 20 -20 మ్యాచ్ ఆడేసింది. కరోనా విలయతాండవంతో.. యావత్ ప్రపంచం వణికింది. ఏ ఒక్క పరిశ్రమనీ వదల్లేదు. ఏ రంగాన్నీ విడిచిపెట్టలేదు. అంతా స్థంభించిపోయింది. చిత్రసీమ కూడా అందుకు మినహాయింపు కాదు. 2021లో అయినా పరిస్థితులు చక్కబడతాయనుకున్నారంతా. తొలి రెండు మూడు నెలలు బాగానే గడిచాయి. ఆ తరవాత.. సెకండ్ వేవ్ దెబ్బకొట్టింది. ఏప్రిల్ లో మూసిన థియేటర్లు ఇప్పటి వరకూ తెరచుకోలేదు. ఆగస్టు వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. 2021 తొలి అర్థభాగం కరోనాకు సమర్పించుకున్నట్టైంది.
* బోణీ బాగుంది
2021 కాస్త బాగానే ప్రారంభమైంది. సంక్రాంతి సీజన్ లో థియేటర్ల దగ్గర కళ కనిపించింది. క్రాక్ తొలి హిట్ నమోదు చేస్తే… రెడ్ ఫర్వాలేదనిపించింది. ఆ నెలలో 14 సినిమాలు విడుదలయ్యాయి. హిట్ ఒక్కటే అయినా – బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాల రాకతో నిర్మాతలకు కాస్త హుషారొచ్చింది. అప్పటి నుంచి నెలకో హిట్ సినిమా వచ్చేది. ఫిబ్రవరి 4 న వచ్చిన `జాంబీరెడ్డి` మంచి వసూళ్లు దక్కించుకుంది. ఇక అందరి దృష్టినీ తన వైపుకి తిప్పుకున్న `ఉప్పెన` వసూళ్లు సునామీ సృష్టించింది. దాదాపు 50 కోట్లు వసూలు చేసి, వైష్ణవ్ తేజ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. నితిన్ – చంద్రశేఖర్ ఏలేటిల `చెక్` బాగా నిరాశ పరిచింది. ఫిబ్రవరిలోనూ దాదాపు 15 చిత్రాలు విడుదలయ్యాయి. మార్చి నుంచి ఈ హంగామా మరింత పెరిగింది. ప్రతీ వారం కనీసం మూడు సినిమాలైనా వచ్చేవి. మార్చి 11న శివరాత్రి సందర్భంగా `గాలి సంపత్`, `శ్రీకారం`, `జాతి రత్నాలు` విడుదలయ్యాయి. జాతిరత్నాలు సూపర్ హిట్ గా నిలిస్తే.. శ్రీకారం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈనెలలోనే విడుదలైన `రంగ్`దే ఓకే అనిపించుకుంది. `మోసగాళ్లు`, `చావు కబురు చల్లగా` లాంటి చిత్రాలు దారుణంగా నిరాశ పరిచాయి.
* వకీల్ సాబ్ హవా
ఏప్రిల్ లో `వైల్డ్ డాగ్` గా ఎంట్రీ ఇచ్చాడు నాగ్. ఆ సినిమాకి ప్రశంసలైతే అందాయి. కానీ జనాలు థియేటర్లకు రాలేదు. ఏప్రిల్ నుంచి కరోనా సెకండ్ వేవ్ భయాలు ప్రారంభం అవ్వడంతో.. జన సంచారం
తగ్గడం మొదలైంది. అయితే ఏప్రిల్ 9న విడుదలైన `వకీల్‌సాబ్`కి ఫ్యాన్స్ నీరాజనం పట్టారు. తొలి మూడు రోజుల్లో బాక్సాఫీసు రికార్డులు కొల్లగొడుతూ భారీ వసూళ్లు అందుకుంది. తొలి వారం పూర్తయ్యేసరికి కరోనా సెకండ్ వేవ్ మరింత విజృంభించింది. కొన్ని చోట్ల థియేటర్లని స్వచ్చందంగా మూసేశారు. అప్పటి నుంచీ.. ఇప్పటి వరకూ థియేటర్లో కొత్త సినిమా అంటూ ఏదీ రాలేదు.
* ఓటీటీ ఫట్టు
థియేటర్లు మూసేసేసరికి.. నిర్మాతలంతా ఓటీటీలను నమ్ముకోవాల్సివచ్చింది. పెద్ద సినిమాలేవీ.. ఆ రిస్కు తీసుకోలేదు గానీ. చిన్నా చితకా చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. అందులో `సినిమా బండి` (నెట్ ఫ్లిక్స్)కి మంచి ఆదరణ లభించింది. `ఏక్ మినీ కథ` (అమేజాన్ ప్రైమ్) కాలక్షేప చిత్రంగా మిగిలిపోయింది.
`బట్టల రామ స్వామి బయోపిక్` (జీ 5 మూవీస్) కీ మంచి ఆదరణ లభించింది. ఇవి మినహాయిస్తే… ఓటీటీలో అదరగొట్టిన సినిమాలేమీ లేవు. అర్థశతాబ్దం, థ్యాంక్యూ బ్రదర్, పచ్చీస్ లాంటి సినిమాలు, కొన్ని మలయాళ అనువాదాలూ ఓటీటీలోకి వచ్చాయి. అయితే దేని గురించీ సగటు ప్రేక్షకుడు పట్టించుకోలేదు.
* ఎదురు చూడాల్సిందే
తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసింది. తెలంగాణలో సాధారణ పరిస్థితితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో ఇంకా లాక్ డౌన్ కొనసాగుతోంది. సినిమా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన పరిశ్రమ. రెండు చోట్లా అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడే.. సినిమాలు విడుదల చేస్తారు. ఆగస్టు వరకూ కొత్త సినిమాలేవీ వచ్చే అవకాశం లేదు. ఆ తరవాత కూడా వేచి చూసే ధోరణిలోనే ఉంది చిత్రసీమ. థియేటర్లలో సినిమా విడుదల చేసేసి, ఆ తరవాత ప్రేక్షకులు రాకపోతే.. ఇంకా నష్టపోవాల్సివస్తుంది. అసలు ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉంది? అని తెలుసుకోవడానికి నిర్మాతలకు కొంత సమయం పడుతుంది. ఈలోగా.. ఓటీటీ వేదిక ఎలాగూ ఉంది. కొన్ని పెద్ద సినిమాలు ఓటీటీలోకి వెళ్లిపోయాయంటూ వార్తలు వస్తున్నాయి. అంటే.. మరో నెల రోజుల వరకూ ఓటీటీలపై ఆధారపడిపోవాల్సిందే.
మొత్తానికి 2021 కూడా టాలీవుడ్ ని పీడిస్తూనే ఉంది. రెండో అర్థభాగమైనా కాస్త ఉపశమనం కలిగిస్తే బాగుంటుంది. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ లేకపోతే.. సెకండాఫ్‌లో భారీ, పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వాటిపైనే అందరి ఆశలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.