డీజే తరవాత అల్లుఅర్జున్ సినిమా ఏదీ మొదలవ్వలేదు. దర్శకుల్ని కలవడం, కథలు ఓకే చేసుకోవడం… ఇవన్నీ బాగానే ఉన్నా – ఏ సినిమా పట్టాలెక్కించలేదు. బన్నీ తదుపరి సినిమా విక్రమ్ కె.కుమార్‌తో ఖాయమైంది. ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కుతుందనుకున్నారు. కానీ అది జరగలేదు. కనీసం సెప్టెంబరులో అయినా మొదలవుతుందనుకున్నారు. కానీ.. ఇప్పుడు అక్టోబరుకి వెళ్లిపోయిందట. విక్రమ్ ఇంకా పూర్తి స్థాయిలో స్క్రిప్టు తయారు చేయలేదని, అందుకు సంబంధించిన పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని టాక్. స్వతహాగానే విక్రమ్ కథని సిద్ధం చేయడానికి చాలా సమయం తీసుకుంటాడు. పైగా `హలో`లాంటి ఫ్లాప్ తరవాత చేస్తున్న సినిమా కాబట్టి.. ఇంకాస్త జాగ్రత్తపడుతున్నాడు. బన్నీ కూడా ఇప్పుడు హాలీడే మూడ్‌లో ఉన్నాడు. ఇప్పటికిప్పుడు సినిమా మొదలెట్టేయాలన్న మూడ్‌లో బన్నీ కూడా లేడు. అందుకే పనులు నిదానంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. `అరవింద సమేత వీర రాఘవ` తరవాత… త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేసే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ విక్రమ్ సినిమా మరీ ఆలస్యమైతే… త్రివిక్రమ్‌కి ఛాన్స్ ఇచ్చేస్తాడేమో చూడాలి.