చిత్రసీమలో నిర్మాతల పరిస్థితి ఏం బాగాలేదు. సినిమా తీయడం ఒక ఎత్తయితే, తీసిన సినిమాని అమ్ముకోవడం మరో ఎత్తవుతోంది. నిన్నా మొన్నటి వరకూ ఓటీటీ, శాటిలైట్ అంటూ ఓ భరోసా ఉండేది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మంచి రాబడే వచ్చేది. థియేట్రికల్ నుంచి ఎంతొచ్చినా, రాకున్నా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అలా లేదు. ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఢమాల్ మన్నాయి. సినిమాలు కొనడమే తక్కువ అయిపోయింది. కొన్నా.. ఇది వరకటి రేట్లు లేవు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ని వీలైనత కంట్రోల్ లో పెట్టుకోవాల్సిన అవసరం నిర్మాతల ముందు ఉంది. అందులో భాగంగా హీరోలు పారితోషికాలు తగ్గించుకొంటే బాగుంటుందన్న మాట ఈమధ్య గట్టిగా వినిపించింది కూడా. నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచి వస్తున్నా రాబడి చూపించి, తమ పారితోషికం పెంచేసుకొన్న హీరోలపై ఆ బాధ్యత ఉంది. నిర్మాతల కష్టాలు గమనించిన పెద్ద హీరోలు దిగి వస్తారని, నిర్మాతలకు అండగా ఉంటారని ఆశించారంతా. కానీ.. పరిస్థితి అలా లేదు. పెంచిన రేట్లు తగ్గించడానికి వాళ్ల మనసులు ఒప్పుకోవడం లేదు. దాదాపు బడా స్టార్సంతా ఇంతే. సినిమా సినిమాకీ తమ పారితోషికాన్ని పెంచుకొంటూ పోవడమే తప్ప.. రిబేట్లు, బేరాలూ వర్కవుట్ కావడం లేదు.
ఇటీవల ఓ హీరో… ఒకే సంస్థలో వరుసగా మూడు సినిమాలు చేశాడు. తొలి సినిమాకి రూ.20 కోట్లు తీసుకొంటే, రెండో సినిమాకి తన పారితోషికం రూ.25 కోట్లకు చేరింది. ఇప్పుడు రూ.30 వసూలు చేస్తున్నాడు. ‘ఓటీటీల బేరాలు లేవు.. రెమ్యునరేషన్ తగ్గించుకోండి’ అని సదరు నిర్మాత కోరినా, హీరో కనికరం చూపించలేదు. మరో బడా హీరో పరిస్థితీ అంతే. ఇటీవల ఆ హీరోకి రెండు ఫ్లాపులు వచ్చాయి. కానీ… పారితోషికంలో ఎక్కడా ఆగలేదు. సినిమా సినిమాకీ పెరుగుతూ పోతోంది. ‘నా సినిమా అంటే శాటిలైట్, డిజిటల్ రేట్లు భారీగా వచ్చేస్తాయ్.. కంగారేం లేదు’ అని చెప్పి మరీ.. అనుకొన్న పారితోషికాన్ని ముక్కు పిండి వసూలు చేసేశాడు.
కొంతమంది నిర్మాతలు హీరోల మనసులు నొచ్చుకోకుండా సినిమాలు తీయాలని అనుకోవడం మరో పెద్ద మైనస్. ‘మీ సినిమాకి శాటిలైట్, ఓటీటీ రేట్లు బాగా పడిపోయాయ్’ అని చెప్పడానికి మొహమాటం. రికార్డు ధరకు సినిమాని అమ్మేస్తాం అని గొప్పగా చెప్పి, ఆ రేటు రాకపోయేసరికి హీరోని ఎలా ఫేస్ చేయాలో తెలీక ఇబ్బంది పడుతున్నారు. సినిమాకొచ్చిన బజ్ చూశాకైనా మంచి రేట్లు వస్తాయన్న నమ్మకంతో మరికొంతమంది ఖర్చుకు వెనుకంజ వేయడం లేదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. కొత్త నిర్మాతలు జోరు. హీరోని లాక్ చేయడం కోసం ఎంత పారితోషికం అయినా ఇవ్వడానికి వాళ్లు రెడీగా ఉంటున్నారు. ఇండస్ట్రీ విషయాలేంటి? మార్కెట్ ఏమిటి? అనే లాజిక్కులు కొత్త నిర్మాతలకు ఇప్పుడే అర్థం కావు. కాబట్టి హీరో క్రేజ్‌ని బట్టి, పారితోషికం పెంచేస్తున్నారు. అందుకే హీరోలు సైతం పారితోషికం తగ్గించుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు.
వాస్తవంగా చెప్పాలంటే ఈ పోకడ మంచిది కాదు. నిర్మాతలు ఉంటేనే పరిశ్రమ ఉంటుంది. వాళ్ల గురించి ఆలోచించాల్సిన బాధ్యత హీరోలపై ఉంది. నిర్మాతలు కూడా తమ రేంజ్ చూపించుకోవడానికి పారితోషికాలు పెంచాల్సిన అవసరం లేదు. తప్పు ఇద్దరి వైపూ ఉంది.