చిత్రసీమలో సంపాదించిందంతా తిరిగి ఇక్కడే పోగొట్టుకొన్నవాళ్లని చాలామందినే చూశాం. ఒకప్పుడు వైభవంగా బతికినవాళ్లు, చివరి దశకు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా అవస్థలు పడిన కథలూ విన్నాం. అయితే కొంతమంది మాత్రం ముందు చూపుతో వ్యవహరిస్తుంటారు. ఫామ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తుంటారు. ముఖ్యంగా… సంపాదనలో కొంతమొత్తం రియల్ రంగంలో పెట్టుబడిగా పెట్టి, తద్వారా వందల కోట్లు కూడబెడుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో ఇలానే చేస్తున్నాడు.
చిత్రసీమకు వచ్చిన కొత్తలో వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేసి, చేతిలో ఏం మిగుల్చుకోని ఆ హీరో, ఆ తరవాత మెల్లగా జాగ్రత్త పడడం మొదలెట్టాడు. పారితోషికంలో కొంత మినహాయించుకొని, మిగిలిందంతా రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టుకొంటూ పోతున్నాడు. ముంబైలో ఓ ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన ఆ హీరో, విదేశాల్లోనూ ఓ బంగ్లా సొంతం చేసుకొన్నాడు. హైదరాబాద్ శివార్ల లో ఓ ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడు. ఈ ఫామ్ హౌస్ ఖరీదు దాదాపుగా రూ.200 కోట్లకు పైమాటే అని టాక్. అయితే పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టడమే కాదు, అప్పులు చేసి మరీ ఆస్తుల్ని కూడబెడుతున్నాడట. ఇటీవల విశాఖపట్నంకు చెందిన ఓ బడా బిజినెస్ మెన్ దగ్గర రూ.150 కోట్లు అప్పు తీసుకొన్నాడని, ఆ డబ్బులతో భూముల్ని కొన్నాడని, తదుపరి సినిమా ద్వారా అందుకొన్న పారితోషికంతో అప్పు తీర్చే ప్రయత్నంలో ఉన్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇది మంచి ఎత్తుగడ. భూముల ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కొందాం అనుకొంటే అమాంతరం ఆ రేట్లకు రెక్కలొస్తాయి. ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయన్న నమ్మకంతో ముందే స్థలాలు కొనేస్తే… ఆ తరవాత ఆ భూముల ధరలే ఒకటికి రెండు రెట్లు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ హీరో ముందు చూపు భలే బాగుంది. మిగిలిన హీరోలూ ఇదే బాటలో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి.