పేరుకి పాన్ ఇండియా హీరో ఆయన. అభిమానులకు దేవుడు. నిర్మాతల కల్ప వృక్షం. హీరో ఓ సినిమా ఒప్పుకొన్నాడంటే, ఓటీటీ… శాటిలైట్ డీల్స్ అయిపోతాయి. నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ఖాయం. కానీ ఇదంతా పేపర్‌పై మాత్రమే. ఆ హీరో మంచోడే. కానీ అలసత్వం, బద్దకం ఎక్కువ. దానికి సినిమాలు బలి అయిపోతున్నాయి.
తన మార్కెట్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో హీరో ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటాడు. తొందర తొందరగా సినిమాలు ఒప్పుకొంటాడు. ఒకేసారి రెండు మూడు సినిమాల్ని లైన్లో పెట్టుకొంటాడు. కానీ… ఏ సినిమాకూ కావల్సినన్ని కాల్షీట్లు ఇవ్వడు. చెప్పిన టైమ్ కి రాడు. వచ్చినా మూడ్ బాగోలేదనో, ఒంట్లో నలతగా ఉందనో, వేరే కారణంతోనో తొందరగా సెట్స్ నుంచి వెళ్లిపోతాడు. చిన్న గ్యాప్ వస్తే చాలు… ఫారెన్ టూర్ చెక్కేస్తాడు. విదేశంలో ఈ హీరోకి ఓ మంచి బంగ్లా వుంది. నెలకు దాదాపు రూ.75 లక్షలు ఆ బంగ్లాకి అద్దె చెల్లిస్తున్నాడు. అందుకే మకాం దాదాపు అక్కడే. ఒక్కసారి వెళ్తే.. తిరిగి రావడానికి కనీసం 20 నుంచి నెల రోజులు పడుతుంది. ఈలోగా షెడ్యూళ్లన్నీ అస్తవ్యస్తం అవుతున్నాయి.
ఆ హీరోకి విషయం చెప్పడానికి నిర్మాతలకు, దర్శకులకు ధైర్యం చాలడం లేదు. మరోవైపు చిత్రీకరణలు ఆలస్యం అవుతున్నాయి. సినిమా రిలీజ్ డేట్లు వాయిదా పడుతున్నాయి. దాంతో నిర్మాత తలపై భారం పడుతోంది. వడ్డీలు పెరుగుతున్నాయి. మిగిలిన ఆర్టిస్టుల డేట్లు చెల్లాచెదురు అవుతున్నాయి. ‘హీరో వచ్చినప్పుడే షూటింగ్.. లేదంటే లేదు’ ఇదీ పరిస్థితి. నిర్మాతలు, దర్శకులు నోరెత్తకపోవడంతో హీరోగారు కూడా రిలాక్స్డ్ గానే ఉండిపోతున్నారు.
ఇటీవల ఆయన నటిస్తున్న ఓ సినిమా రషెష్ చూశారు. కొన్ని మార్పులూ చేర్పులూ చెప్పారు. రీషూట్లకు కనీసం 40 నుంచి 50 రోజులు కావాలి. అన్ని కాల్షీట్లు ఇవ్వాలంటే హీరోగారికి ఎన్ని రోజులు పడుతుందో? దాంతో ఆ సినిమా రిలీజ్ డైలామాలో పడింది. చేతిలో సినిమాలు ఉన్నా, అవి ఇంకా పూర్తి కాకపోయినా, కొత్త సినిమాలకు సంతకాలు పెట్టేసి, అడ్వాన్సులు తీసేసుకొంటున్నాడు ఆ హీరో. ఏం ధైర్యమో అది. నిర్మాతలు కూడా హీరోగారు డేట్లు ఇస్తే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దాంతో హీరో ఆడిందే ఆట, పాడిందే పాటగా చలామణీ అవుతోంది.