మన హీరోలపై ఓ విమర్శ వుంది. కమర్షియల్ ఛట్రం నుండి బయటికిరారని. ఇందులో వాస్తవం కూడా వుంది. తమకున్న ఇమేజి , మార్కెట్ లెక్కలు అనుకునంగా కమర్షియల్ హంగులతో కూడిన చిత్రాలు చేయడానికి మక్కువ కనబరుస్తున్నారు హీరోలు. ప్రయోగాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమ మార్గమనే మైండ్ సెట్ లో ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తారు. అయితే ఇప్పుడు హీరోల మూడ్ మారుతోంది. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా ఒక్కింత వైవిధ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి తాము సిద్దమే అనే సంకేతాలు ఇస్తున్నారు. ఇటివలే సెట్స్ పైకి వెళుతున్న సినిమాలు చూస్తుంటే ప్రయోగాలకు సిద్ధమైపోయినట్లు అనిపిస్తుంది.
దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ చేస్తున్న సినిమా రాజా ది గ్రేట్. ఈ చిత్రంలో గుడ్డివాడిగా కనిపిస్తున్నాడు రవితేజ. ఇలాంటి రోల్ చేయడం రవితేజకు ఇదే మొదటిసారి. అలాగే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సుకుమార్ సినిమా అనగానే వైవిధ్యం అనే అంచనాలు వుంటాయి. ఇప్పుడు చరణ్ తో కూడా ఓ వైవిధ్య మైన కధ చెప్పాలని డిసైడ్ అయ్యాడు సుకుమార్. పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు రెండు షేడ్స్ వుంటాయట. ఇందులో చరణ్ చెవిటివాడిగా కనిపిస్తాడని టాక్. అలాగే వెంకటేష్, క్రిష్ కలయికలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రంలో వెంకీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇందులో ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్ వుంటాయని తెలిసింది. అలాగే గెటప్ కూడా
షాకింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి రెడీ అవుతున్నారు తారక్. ఈ చిత్రంలో తారక్ మొత్తం మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. గెటప్స్ కూడా డిఫరెంట్ గా వుండబోతున్నాయి. ఇందుకోసం స్పెషల్ గా హాలీవుడ్ నుండి ‘వాన్స్ హార్ట్వేల్’అనే ప్రఖ్యాత మేకప్ ను ఎంపిక చేశారు.
గౌతమి పుత్ర కూడా ఓ ప్రయోగాత్మక చిత్రమే. చారిత్రక అంశాలున్న కథని ఎంచుకోవడం ప్రయోగం కాకపోతే మరేంటి? అలానే… ఈనెల 10న విడుదల అవుతున్న ఓం నమో వేంకటేశాయ. ఈరోజుల్లో ఈ తరహా కథల్ని ఎంచుకోవడం సాహసమే అనుకోవాలి.
మొత్తంమ్మీద ప్రస్తుతం సెట్స్ పైకి వెళుతున్న సినిమాలు చూస్తుంటే మన హీరోలు ప్రయోగాలకు తాము సిద్ధం అనే సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలన్నీ కూడా కంప్లీట్ గా అవుట్ అఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ లు అని చెప్పలేం. కమర్షియల్ యాంగిల్ జోడించే వుంటాయి. అయితే ఎంతో కొంత వైవిధ్యానికైతే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పొచ్చు. ఈ ప్రయత్నాల్లో సరైన విజయాలు లభిస్తే మున్ముందు మరిన్ని వైవిధ్య, ప్రయోగాత్మక చిత్రాలు వచ్చే అవకాశం అయితే వుంది.