కరోనా కష్టాలు చిత్రసీమకు కుదిపేస్తున్నాయి. సినిమా రంగం ఈ ఉపద్రవం నుంచి ఇప్పట్లో బయటపడడం కష్టమే. చేయగలిగింది ఏమైనా ఉంటే, అది నష్టాల్ని తగ్గించుకోవడమే. అందుకే కాస్ట్ కటింగ్, బడ్జెట్ కంట్రోల్ అనే టాపిక్ మళ్లీ మొదలైంది. హీరోలు, హీరోయిన్లతో పాటు మిగిలిన వాళ్లు పారితోషికం తగ్గించుకోవాల్సిందే అంటూ నినదిస్తున్నారు నిర్మాతలు. తమిళ నాడులో ఇప్పటికే చలనం మొదలైంది. అక్కడ హీరోల పారితోషికంలో 50 శాతం తగ్గిస్తున్నామంటూ నిర్మాతల మండలి ప్రకటించింది. ఇప్పటికే… కొంతమంది హీరోలు స్వచ్ఛందంగా తమ పారితోషికాన్ని తగ్గించుకున్నారు. మలయాళ చిత్రసీమలో అగ్ర హీరోలంతా పారితోషికాన్ని తగ్గించేశారు. మరి తెలుగు హీరోల మాటేంటి? మన హీరోలకు అంత పెద్ద మనసుందా?
ఇక్కడ ఈ విషయంలో ఇప్పటి వరకూ ఒక్క హీరో కూడా బహిరంగంగా స్టేట్ మెంట్ ఇవ్వలేదు. `నా పారితోషికం తగ్గించా` అని ప్రకటించుకోలేదు. పారితోషికం ఎంతన్నది నిర్మాతలకు తెలిస్తే సరిపోతుంది అనుకుంటున్నారో, లేదంటే… పారితోషికాలు తగ్గించుకునే అవసరం తమకు లేదని భావిస్తున్నారో అర్థం కావడం లేదు. ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రం ‘మా పారితోషికం తగ్గించుకోవడానికి రెడీనే’ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. మిగిలిన వాళ్లంతా మౌనంగా ఉన్నారు. ఓ దర్శకుడు గానీ, హీరోగానీ… రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన దాఖలా ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమలో జరగలేదు.
‘మీ పారితోషికం తగ్గిస్తున్నాం’ అంటూ తమిళ నిర్మాతలు ధైర్యంగానే చెప్పగలిగారు. కానీ.. ఈ విషయమై తెలుగులో ఒక్క నిర్మాత కూడా మాట్లాడలేదు. ఏమైనా అంటే… హీరోలకు కోపాలు వచ్చేస్తాయని భయం. అసలు హీరోకీ, దర్శకుడికీ పారితోషికం ఇంత… అని ఫిక్స్ చేయాల్సింది ఎవరు? నిర్మాతే కదా. నిజానికి ఆ అవకాశం కూడా నిర్మాతలకు దొరకదు. ‘చివరి సినిమాకి నా పారితోషికం ఇంత. దానికి మరికొంత కలిపి ఇవ్వు’ అని దర్శకుడు, హీరో చెబితే నిర్మాతల తలకాయ ఊపడాలు తప్ప, ‘మీకు ఇంత ఇవ్వాలనుకుంటున్నా’ అని చెప్పే ధైర్యం, అవకాశం రెండూ తెలుగు నిర్మాతలకు లేవు. అందులోనూ అగ్ర హీరోల దగ్గర.
ఇటీవల ఓ హీరోతో కొత్త సినిమాని ప్రకటించారు. సదరు హీరోకి వరుసగా ఫ్లాపులు. చివరి రెండు సినిమాలైతే డిజాస్టర్లు. అయినా సరే, ఆ హీరో పారితోషికం తగ్గించలేదు. సరి కదా.. చివరి సినిమా కంటే ఎక్కువే గుంజాలని చూశాడు. ఫ్లాప్ హీరోల పరిస్థితే ఇలా ఉంటే, హిట్టు కొట్టిన హీరోలు ఊరుకుంటారా? కోట్లకు కోట్లు పెంచుకుంటూ పోరూ..? ఈ యేడాది సూపర్ హిట్ చిత్రంలో నటించిన కథానాయిక.. ఒక్కసారిగా తన పారితోషికాన్ని డబుల్ చేసేసింది. ‘కరోనా కదా… కనికరం చూపించు’ అని కొత్త నిర్మాతలు వేడు కుంటున్నా `నా రేటు ఇంతే.. ఇంత అయితేనే చేస్తా` అంటూ మొహమాటం లేకుండా మాట్లాడుతోందట. ఇలాంటి పరిస్థితుల్లో పారితోషికాలు తగ్గించుకోవడాల గురించి ఆలోచించడం అనవసరం.
నిర్మాత ఉంటేనే సినిమా ఉంటుంది. సినిమా ఉంటేనే.. హీరోలూ, హీరోయిన్లు, దర్శకులు. ఈ విషయం తెలిసి కూడా.. నిర్మాతలపై జాలి చూపించడం లేదెవ్వరూ. కొంతమంది నిర్మాతలు కూడా ఆ హీరో కాల్షీట్లు ఇస్తే చాలు, ఈ దర్శకుడితో సినిమా చేస్తే చాలు.. అనుకుంటున్నారు తప్ప, ఆ సినిమా మార్కెట్ ఏంటి? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనే లెక్కలు వేసుకోవడం లేదు. అందుకే.. కాస్ట్ కటింగ్, పారితోషికాల తగ్గింపు అనేది – తెలుగు నాట నవ్వుల పాలవుతున్న మాటలుగా మిగిలిపోతున్నాయి.