తమిళనాడు జల్లికట్టు ఫీవర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. జల్లికట్టు పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవాలనే నినాదాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు జల్లికట్టు రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలాను ధిక్కరిస్తూ.. తమ సంప్రాదాయాన్ని తోక్కేస్తున్నారని ఆగ్రహించిన తమిళతంబీలు ఏకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయ పార్టీలు, సినీ పరిశ్రమ, ప్రముఖులు.. ఏకమై జల్లికట్టు ను సాధించుకున్నారు. వీరి నిరసనలకు తలొగ్గిన కేంద్రం జల్లికట్టుకు లైన్ క్లియర్ చేస్తూ తాత్కాలిక ఆర్డినెన్స్ ను పాస్ చేసింది. దీంతో తమిళప్రజలు ఎంతో కొంత సాధించుకున్నట్లు అయ్యింది.
అయితే ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రత్యేకహోదా కోసం పోరాటం జరగాలని నినాదాలు రావడం ఆసక్తికరంగా మారింది. స్పెషల్ స్టేటస్ కి జల్లికట్టు పోరాటంతో లింకా ? ఇలాంటి లాజిక్కుల పక్కన పెడితే.. జల్లికట్టు తరహా పోరాటం ఇక్కడ సాధ్యపడుతుందా ?అనే పాయింట్ ను గనక పరిశీలిస్తే.. జల్లికట్టులో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది సినీపరిశ్రమ. మొత్తం తమిళ సినీ పరిశ్రమ కదిలింది. కమల్ హసన్ , రజనీ కాంత్ , సూర్య , అజిత్, విజయ్ .. ఇలా ఇండస్ట్రీలోని హీరోలందరూ రోడ్లపైకి వచ్చేశారు. దర్శకుడు, నటుడు లారెన్స్ అయితే తన చేతి నుండి దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసి అందోళన కారులకు ఆహార పదార్ధాలు పంచిపెట్టాడని భోగట్ట. అటు హీరోయిన్స్ కూడా కధం తొక్కారు. కొందరు అందోళనలో పాల్గొంటే ఇంకొందరు.. సోషల్ మీడియాలో వీడియో లు తీసి హాల్ చల్ చేశారు.
మరి, ఇప్పుడు ఏపీలో జల్లికట్టు తరహా పోరాటం అంటే.. తెలుగు సినీ పరిశ్రమ కదలివస్తుందా? అక్కడి జల్లికట్టు చూసుకుంటే రాజకీయంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవు. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం సహా జల్లికట్టు జరగాల్సిందే అనే నినాదాన్ని ఇచ్చాయి. కానీ ఇక్కడ స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు సర్కారే పెద్ద ప్రతికూలం. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు పోలిక ఏమిటో తనకు అర్థం కావట్లేదని, రాష్ట్రాభివృద్ధే తనకు ముఖ్యమని, కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అంటూ ఎప్పటిలానే ఎప్పటిలానే పాత క్యాసెట్టు వినిపించారు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు. మరి ఎలాంటి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురెల్లి నిలబడగల తెగువ మన హీరోలు చూపించగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.