రజనీకాంత్ – నెల్సన్ కాంబోలో వచ్చిన ‘జైలర్’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. రజనీకాంత్ వయసుకు తగిన పాత్రలో కనిపించి అలరించారు. రజనీ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఫ్యాన్స్ అందరికీ నచ్చింది. ఇప్పుడు జైలర్ 2 రాబోతోంది. ఇది జైలర్‌కు సీక్వెల్ కాదు. ప్రీక్వెల్. జైలర్‌గా రజనీకాంత్ ఏం చేశాడు? అనేది తెరపై చూపించబోతున్నారు. జైలర్ విజయంలో గెస్ట్ అప్పీరియన్స్‌లు కీలక పాత్ర పోషించాయి. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఇప్పుడు జైలర్ 2లోనూ గెస్ట్ రోల్స్ కి స్థానం ఉంది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు నెల్సన్ కూడా ఈ విషయంలో ఓసారి స్పందించారు. బాలయ్య అంటే తనకు ఇష్టమని, జైలర్ 1 కోసం ఆయన్ని సంప్రదించాలని భావించానని, అయితే.. బాలయ్య ఒప్పుకొంటారో, లేదో అనే అనుమానంతో ఆ ఆలోచన విరమించుకొన్నానని చెప్పుకొచ్చారు. ‘జైలర్ 2’ లో బాలయ్య కోసం నెల్సన్ ఓ పవర్ ఫుల్ పాత్ర రాసుకొన్నాడట. ఇందులో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్.
అయితే ఈ సినిమాలో మరో తెలుగు హీరో కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఆ హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. దక్షిణాదిలోని సూపర్ స్టార్లంతా ‘జైలర్ 2’లో ఉండే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి బాలయ్య పాత్ర ఓకే అయినట్టే. మిగిలిన ఆ స్టార్లు ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఇటీవల ‘జైలర్ 2’కి సంబంధించిన ఓ గ్లింప్స్ విడుదలైంది. అందులో రజనీ మార్క్ మాస్ మరోసారి చూపించాడు నెల్సన్. ఆ గ్లింప్స్ తో ఈ సీక్వెల్ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. తెలుగు నుంచి బాలయ్య కూడా తోడైతే – జైలర్‌కి ఆకాశమే హద్దు.