కరోనా మహమ్మారి వ్యవస్థ మొత్తాన్ని అతలాకుతలం చేసింది. సినిమా పరిశ్రమనైతే మరీనూ. లాక్ డౌన్ సమయాల్లో థియేటర్లు మూతబడ్డాయి. లాక్ డౌన్ ఎత్తేసినా – థియేటర్ వ్యవస్థ ఇంకా తేరుకోలేదు. కొన్ని థియేటర్లు ఇప్పటికే షాపింగ్ మాల్స్ లా మారిపోయాయి. అదే బాటలో ఇంకొన్ని థియేటర్లూ చేరబోతున్నాయి. ఓటీటీల హవాతో… ఈ వ్యవస్థ మరింత కృంగిపోయింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో థియేటర్ వ్యవస్థని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వేడుకుంటోంది. అందులో భాగంగా కొన్ని ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుంచింది.
అందులో భాగంగా.. జీవో నెం 75ని వెనక్కి తీసుకోవాలని ఛాంబర్ కోరుతోంది. ఈ జీవో ప్రకారం.. పార్కింగ్ ఛార్జిలను ప్రభుత్వం రద్దు చేసింది. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులపై అదనపు భారాన్ని తగ్గించింది. అయితే పార్కింగ్ తమ ఆదాయ వనరుల్లో ఒకటని, పార్కింగ్ ఛార్జిలను ఎత్తేయడం వల్ల.. థియేటర్ లకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతుందని థియేటర్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్ వ్యవస్థ మొత్తం అతలాకుతలమైందని, పార్కింగ్ చార్జీలను వసూలు చేసుకునే అవకాశాన్ని తిరిగి తమకు కల్పించాలని కోరుతున్నారు. కరోనా సమయంలో… థియేటర్ల కరెంట్ ఛార్జీలను మినహాయించాలన్నది మరో ఆభ్యర్థన. ఏప్రిల్ నుంచి.. థియేటర్లు మూసే ఉన్నాయి. అయితే ప్రతీ నెలా.. కనీస కరెంట్ ఛార్జీ మాత్రం థియేటర్లు కట్టాల్సిన అవసరం ఏర్పడింది. మూడు నెలల కరెంట్ ఛార్జీలూ తడిసి మోపెడు అవుతున్నందున.. వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. లాక్ డౌన్ సమయంలో.. ప్రాపర్టీ టాక్స్ నుంచి కూడా మినహాయించాలని, మరో రెండేళ్ల వరకూ.. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చి, థియేటర్ వ్యవస్థని ఇదుకోవాలని కోరుతూ ఓ వినతీ పత్రాన్ని ప్రభుత్వానికి అందజేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మరి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.