“నా అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పగలను… నా హక్కుల కోసం నేను నిలబడగలను… నేను స్ట్రాంగ్… మేల్ డామినేషన్ వంటివి వున్నా అసలు ఎఫెక్ట్ అవ్వను” – కాజల్ అగర్వాల్.
ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ గురించి ప్రశ్నిస్తే చెప్పిన జవాబు.
“అమ్మాయి అలుసు ఇస్తుందని, ఏది చెబితే దానికి అంగీకరిస్తుందని… ఆమెను పెట్టి ఎవరూ వంద కోట్ల రూపాయలతో సినిమా తీయరు. వందకోట్ల సినిమాలో ఆమెను తీసుకోరు. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా చివరకు ప్రతిభే మాట్లాడుతుంది. కాకపోతే కొంచెం సమయం పట్టవచ్చు. కాస్టింగ్ కౌచ్ గురించి డిస్కషన్ ఎప్పటి నుంచో ఉంది. నా గురించి మాత్రమే నేను మాట్లాడగలను. ఇండస్ట్రీలో నాకు ఎప్పుడూ అటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు” – రకుల్ ప్రీత్ సింగ్.
కాస్టింగ్ కౌచ్ గురించి తెలుగమ్మాయిలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీకు అటువంటి అనుభవాలు ఎదురు కాలేదంటున్నారు. అంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటారా? అని ప్రశ్నిస్తే చెప్పిన జవాబు.
ఒక్క కాజల్ అగర్వాల్, ఒక్క రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే కాదు… రాశీ ఖన్నా, లావణ్యా త్రిపాఠి తదితర స్టార్ హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు లేవని చెబుతన్నారు. సమంత, తమన్నా, పూజా హెగ్డే తదితరులు ఈ విషయంపై మౌనం వహిస్తున్నారు.
మొన్నటివరకూ సినిమా వార్తలకు పరిమితమైన ఈ అంశం…. శ్రీరెడ్డి వివాదం కారణం సామాన్యుల మధ్య చర్చకు దారి తీసింది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఈ విధంగా వుంటే… స్టార్ హీరోయిన్ల పరిస్థితి ఏంటి? వాళ్లకు ఎన్ని వేధింపులు వుంటాయో? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశాల గురించి వారు ఎక్కడ అయినా మాట్లాడరేమో అని ఆరా తీస్తుంటే… ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే…కాస్టింగ్ కౌచ్ విషయం వచ్చే సరికి స్టార్ హీరోయిన్లు సైలెంట్ మోడ్‌లోకి వెళ్తున్నారు.
‘కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం’ అన్నట్టుంది కాస్టింగ్ కౌచ్ విషయంలో స్టార్ హీరోయిన్ల పరిస్థితి. తమకు ఎదురైన చిన్న చిన్న సమస్యలు చెప్పి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారు. తప్పుగా ప్రవర్తించిన వ్యక్తి పేరు చెప్పడానికి భయపడడం లేదు. అతడు కత్తి గట్టి తమకు వచ్చే అవకాశాలను ఎక్కడ తప్పిస్తాడోననే భయమే వారిలో ఎక్కువ వుందట. అలాగని, ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెబితే… పోరాటం చేస్తున్న వాళ్ల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. అందుకని, ఎక్కువమంది ఈ విషయం గురించి పబ్లిగ్గా మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు.