2024 క్యాలెండర్లో నాలుగు నెలలు గడిచిపోయాయి. ఈ వ్యవధిలో తెలుగు చిత్రసీమ చూసింది అరకొర విజయాలే. ఏప్రిల్ అయితే… డిజాస్టర్లకు నెలవుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నికల హంగామా ముగుస్తుంది. ఆ తరవాత కొత్త సినిమాలు జోరందుకొంటాయి. అందుకే.. మరో రెండు వారాల పాటు టాలీవుడ్ కు ఈ గడ్డుకాలం ఎదుర్కోక తప్పదు. ఆ తరవాతైనా చిత్రసీమ జోరు చూపిస్తుందా, చూపిస్తే ఆ రేంజ్ ఎలా ఉండబోతోందన్న ఆశల పల్లకిలో తెలుగు చిత్ర నిర్మాతలు ఊగుతున్నారు.
మే తొలి వారంలో 2 సినిమాలు వస్తున్నాయి. ఆ ఒక్కటీ అడక్కు, ప్రసన్న వదనం ప్రేక్షకుల ముందుకు వస్తాయి. రెండోవారం సినిమాలు పెద్దగా ఉండకపోవొచ్చు. అయితే ఎన్నికలు ముగిసిన మరుసటి వారం నుంచి కొత్త సినిమాల హంగామా మళ్లీ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈనెల 17నే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వస్తోంది. విశ్వక్సేన్ నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూపొందించింది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆ మరుసటి వారం `లవ్ మి` విడుదలకానుంది. ఆశీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య కథానాయిక. `బేబీ`తో వైష్ణవికి మంచి గుర్తింపు వచ్చింది. ‘బేబీ’ లక్ ఈ సినిమాకు కలిసొచ్చే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో రావల్సిన ‘ప్రతినిధి 2’ వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘గం గం గణేషా’ మే 31న విడుదల కానుంది. కాజల్ ‘సత్యభామ’గా అవతారం ఎత్తిన సినిమా కూడా ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హరోం హర’ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 31న విడుదల చేస్తున్నారు. ‘రాజు యాదవ్’, ‘శబరి’ లాంటి చిత్రాలు ఈనెలలోనే థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి.