వైసీపీ హయంలో తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు నరకం చూసింది. జగన్ నియంత పాలన సినిమా పరిశ్రమని కూడా ఇబ్బంది పెట్టింది. టికెట్ రేట్లతో ఆడుకున్నారు. అడుగడునా ఆంక్షలు విధిస్తూ హిట్లర్ జీవోలతో ఒక భయానక వాతావరణం సృష్టించారు. ఇప్పుడు ఆంధ్రపదేశ్ లో ప్రభుత్వం మారింది. టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. సినిమా పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఏకంగా 21కి 21 సీట్లు గెలుచుకొని గొప్పగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న తరుణమిది. పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయనపై బోలెడు నమ్మకాలు పెట్టుకున్నారు సినీ ప్రముఖులు.
తాజాగా జరిగిన శర్వానంద్ మనమే ప్రీరిలిజ్ వేడుకలో పవన్ నామస్మరణతో మొగిపోయింది. చంద్రబాబు, పవన్ విజయం రాష్ట్రానికి పండగ తెచ్చిందని శర్వానంద్ తో పాటు యూనిట్ సభ్యులంతా ముక్తకంఠంతో చెప్పారు. పిఠాపురంలో `మనమే` సక్సెస్ మీట్ వుంటుందని ప్రకటించారు. ఇకపై అన్ని మంచి రోజులే అనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ లో వక్తల మాటలు గమనిస్తే వైసీపీ పాలనలో చిత్ర పరిశ్రమ ఎంతటి డిప్రెషన్ కి లోనైయిందో అర్ధం చేసుకోవచ్చు. రాక్షసుని చెర నుంచి విముక్తి పొందిన ఫీలింగ్ వారిలో కనిపించింది.
జగన్ అధికార అహంతో చిత్ర పరిశ్రమని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే. పరిశ్రమ విషయంలో జగన్ అన్యాయాలపై పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమా వేదికలపై మాట్లాడారు. జగన్ విధానాలని ఎండగట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు. దీంతో యావత్ పరిశ్రమ ఆయనపై బోలెడు ఆశలు పెట్టుకుంది, ఇప్పుడు అందరూ పవన్ తప్పకుండా పరిశ్రమ విషయంలో చొరవ తీసుకుంటారని, పరిశ్రమకు మంచి రోజులు మొదలౌతాయని ఆశిస్తున్నారు.
అయితే విజయం తర్వాత ఇలా బహిరంగ వేదికలపై మాట్లాడిన చాలా మంది ఎన్నికలకి ముందే పవన్ వెంట తాము వున్నామనే సంకేతాలు ఇచ్చివుంటే ఇంకా గౌరవంగా వుండేది. ఏదేమైనా ఇప్పుడు చిత్ర పరిశ్రమ జనసేనానిని ఇప్పుడు మరింత గట్టిగా నమ్ముతోంది. ఓ హీరోగా పరిశ్రమలో ఉన్న ఇబ్బందులేమిటో ఆయనకు బాగా తెలుసు. మరి పరిశ్రమ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి చొరవ తీసుకుంటారో అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.