ఇన్నాళ్లూ… ‘మా సినిమా హిట్టవ్వాలి దేవుడా’ అని కోరుకోవడమే చూశాం. పక్కవాడి సినిమా కూడా హిట్టవ్వాలని, రికార్డులు సాధించాలని, ఆడియో వేడుకల్లో మాత్రమే చెబుతుంటారు. లోపల మాత్రం… ‘ఆడితే ఏంటి? ఆడకపోతే ఏంటి’ అన్నట్టే ఉంటుంది వ్యవహారం. చిత్రసీమలో పోటీ మామూలుగా ఉండదు. పక్కవాడి సినిమా ఆడేస్తుంటే.. లోలోపల నలిగిపోయేవాళ్లెందో మంది. అయితే… ఈ ఒక్కసారికి మాత్రం ఓ సినిమా ఆడాలని బలంగా కోరుకుంటున్నారంతా. ఆ సినిమానే `సోలో బతుకే సో బెటరు`.
సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా ఇది. క్రిస్మస్కి విడుదల అవుతోంది. సాయి ధరమ్ పై ప్రేమతోనో… ఆ సినిమా తీసిన దర్శక నిర్మాతలపై ఇష్టంతోనో.. `హిట్టు దేవోభవ` అనుకోవడం లేదు. ఈ హిట్టు.. సాయిధరమ్ తేజ్కంటే.. పరిశ్రమకు చాలా అవసరం. లాక్ డౌన్ తరవాత పరిస్థితులు చక్కబడి, థియేటర్లకు అనుమతులు ఇచ్చినా, సినిమాలేవీ రాలేదు. దానికి రకరకాల కారణాలు. అయితే.. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కుంటూ… `సోలో బతుకే..` వస్తోంది. మామూలుగా అయితే.. అన్ని సినిమాల్లానే ఇది కూడా. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే.. ఇదో పైలెట్ ప్రాజెక్ట్ అయిపోయింది.
కరోనా భయాలతో జనాలు థియేటర్లకు వస్తారో రారో తెలీదు. వచ్చినా 50 % ఆక్యుపెన్సీతో థియేటర్లు మనుగడ సాగిస్తాయో లేదో తెలీదు. అసలు జనాలకు సినిమా చూడాలన్న మూడ్ ఉందో లేదో తెలీదు. వాటన్నింటినీ, కరోనా నియమ నిబంధనల మధ్య థియేటర్లు నడపడంలోని సాధక బాధకాలకు ఇది ట్రైలర్‌గా ఉపయోగపడుతుంది. `సోలో బతుకే..` బండి సక్రమంగా నడిచేసి, ఆ 50 శాతం ఆక్యుపెన్సీ అయినా వస్తే – సూపర్ సక్సెస్ అయినట్టే. తరవాత రాబోయే సినిమాలకు, రావాలనుకుంటున్న సినిమాలకు ఈ సినిమా ఓ ఊతంలా ఉపయోగపడుతుంది. లెక్క ఏమాత్రం తేడా వచ్చినా – సంక్రాంతి సినిమాలు సైతం ఆగిపోతాయి.
అందుకే ఈ సినిమా ఆడాలని చిత్రసీమ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఈసినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చిత్రసీమకు చెందినవాళ్లంతా.. ఈసినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే థియేటర్ల మనుగడ సాగాలన్నా, సినిమాలు విడుదల చేసేందుకు ధైర్యం చేయాలన్నా – ఈ సినిమా విజయం ఎంతో కీలకం. జనాల్ని థియేటర్లకు రప్పించేలా ప్రమోషన్లు చేయడం… కేవలం ఆయా చిత్ర దర్శక నిర్మాతల పనే కాదు. చిత్రసీమలోని వాళ్లంతా తమ బాధ్యతగా భుజాలపై మోయాల్సిన అవసరం వుంది. మరి ఏం చేస్తారో చూడాలి.