సినిమా వాళ్లను బెదిరించడం చాలా ఈజీ అనుకుంటున్నారు. వాళ్లపై రాళ్లేస్తే తమపై డబ్బుల వర్షం కురిపిస్తారని అనుకుంటున్నారు. రాజకీయ నేతలను మించి సామాన్యులు కూడా అదే రకం బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. మోహన్ బాబు నుంచి ఎన్టీఆర్ వరకూ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. మీడియా, రాజకీయ నాయకులు, చివరికి ఫ్యాన్స్ పేరుతో కూడా కొంత మంది హీరోల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సినిమా వాళ్లు ఇంత లోకువ ఎందుకయ్యారు ?
మోహన్ బాబును రాచి రంపాన్ని పెట్టిన మీడియా – బోనస్‌గా హత్యాయత్నం కేసు
మోహన్ బాబు ఇంట్లో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. వాళ్లది సినిమా ఫ్యామిలీ కాబట్టి సమాచారం మసాలా దట్టించి ప్రజలకు ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉంది. వారి సమస్యల్లో వారు ఉంటే.. ఇంట్లోకి దూసుకెళ్లి మూతి ముందు మైక్ పెడితే ఎవరికైనా కోపం రాదా? . అప్పటికే పరువు ప్రతిష్ట పోయాయని ఆయన బాధపడుతూంటారు. ఆవేశంలో ఆయన కొట్టారు. హత్యాయత్నం కేసు అయింది. ఫ్యామిలీ గొడవలకు తోడు ఈ కేసు. మాట కంటే ముందు ఆయన పరారీ అని బ్రేకింగ్‌లు వేసి ఇప్పటికీ వేధిస్తున్నారు. ఎందుకింత అలుసయ్యారు?
అల్లు అర్జున్ వ్యవహారంలో ఏం జరుగుతోంది ?
పుష్ప సినిమా గురించి ఇప్పుడెవరూ మాట్లాడుకోవడం లేదు. అంతా అల్లు అర్జున్ తీరు, ఆయనపై పోలీసులు తీసుకునే చర్యలు, మళ్లీ జైలుకెళ్తాడా లేదా అన్న అంశంపైనే చర్చలు జరుగుతున్నాయి.ఎవరు చేశారు..ఎందుకు చేశారన్నది అప్రస్తుతం. ఇంత హైలెట్ కావడానికి సినిమా వాళ్లు అవడమే కారణం. ఇక్కడా ఆయన సాయం చేయలేదు.. పరామర్శించలేదు.. అని చెప్పి అర్జున్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు. కళ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు పుష్పటీం. ఎందుకింత అలుసయ్యారు?
ఎన్టీఆర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఫ్యాన్ ఫ్యామిలీ
తిరుపతిలోని ఓ యువకుడు తాను ఎన్టీఆర్ అభిమానని చావు బతుకుల్లో ఉన్నానని .. దేవర చూసి చచ్చిపోతానని ఎమోషనల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ లో ధైర్యం చెప్పారు. టీటీడీ ద్వారా.. ఫ్యాన్స్ ద్వారా రూ. 55 లక్షలు సాయం అందింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ అయినంత మాత్రాన తమ బిడ్డ బాధ్యత ఎన్టీఆర్ దే అయినట్లుగా ఇంకా రూ. ఇరవై లక్షలు ఇవ్వాలని ప్రెస్‌మీట్ పెట్టారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేసి.. ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు పిండుకోవాలనుకున్నారు. ఫ్యాన్స్ కూడా హీరోల్ని అలుసుకునేంత పరిస్థితి ఎందుకు మారింది ?
టాలీవుడ్ కు ఇప్పుడు రోజులు కలసి రావడం లేదు. కొత్త ఏడాదిలో అయినా .. మంచి రోజులు వస్తాయేమో చూడాలి.