టాలీవుడ్ లో మరోసారి వాయిదాల తలనొప్పి మొదలైయింది. కరోనాకి ముందు ఈ వాయిదా చిక్కులు విపరీతంగా ఉండేవి. కరోనా తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు కనిపించింది. కొన్ని ప్రాజెక్ట్లు తప్పితే దాదాపు సినిమాలన్నీ అనుకున్న సమయానికే విడుదలయ్యేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.
ముఖ్యంగాపెద్ద సినిమాలకు వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ వాయిదాల వలన ప్రేక్షకులు, అభిమానులు చాలా నిరాశ చెందారని రొటీన్ గా చెప్పుకునే మాటలే కానీ అసలు వాయిదాల వలన నిలిగిపోయేది నిర్మాతలు, సినిమాలే.
ఒక డేట్ కి రావాల్సిన సినిమా వాయిదా పడి నాలుగు నెలలు వెనక్కి వెళ్ళడం అంటే మాటలు కాదు. ఈ నాలుగు నెలల వడ్డీలు లెక్క వేసుకుంటే చుక్కలు కనిపిస్తాయి. అలా వాయిదా పడిన తర్వాత సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ కొట్టినా ఈ వడ్డీలని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. సినిమా మంచి హిట్ కొట్టినా నిర్మాతలు లాభాలు చూడకపోవడానికి ఇలాంటి కారణాలే వుంటాయి.
సినిమా వాయిదా పడుతూ వెళ్ళడం వలన ప్రాజెక్ట్ చుట్టూ వున్న బజ్ తగ్గిపోవడం కామన్. పైగా సినిమా వాయిదా పడటం ఒక బ్యాడ్ సైన్. గణాంకాలు చూసుకుంటే వాయిదాల పర్వం తర్వాత వచ్చిన సినిమాలు సంచలనం సృష్టించిన దాఖలాలు లేవు. పైగా వాయిదాతో కొన్ని నెగిటివ్ కథనాలు కూడా తెరపైకి వస్తాయి. అవి ఆ ప్రాజెక్ట్ పై వున్న బజ్ ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి.
వాయిదాల వలన మరో నష్టం వుంది. సినిమా రిలీజ్ షెడ్యుల్ అంతా దెబ్బకొడుతుంది. ఒక డేట్ లో రావాల్సిన సినిమా వాయిదా పడితే.. అదే డేట్ ని మరో సినిమా అక్యుపై చేసుకోవాలని చూస్తుంది. కానీ ఆ సినిమా పనులు ఇంకా మధ్యలోనే ఉండొచ్చు. అయితే మంచి డేట్ దొరికిందని హరీబుర్రీగా పనులు కానించేస్తారు. దీంతో సినిమా క్యులిటీ దెబ్బ తింటుంది.
రామ్ డబుల్ ఇస్మార్ట్, అల్లు అర్జున్ పుష్ప 2, కమల్ హాసన్ ఇండియన్ 2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. ఇవన్నీ వాయిదా పడిన చిత్రాలే. డబుల్ ఇస్మార్ట్ ఎప్పుడో మహాశివరాత్రికి రావాల్సింది. తర్వాత ఓకే రిలీజ్ డేట్ అంటూ లేకుండా పోయింది. పుష్ప వెనక్కి వెళ్ళడంతో ఆ డేట్ లో కూర్చుంది. ఇక ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ వాయిదాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమాలకే శంకరే డైరెక్టర్. ఇంత తక్కువ గ్యాప్ లో శంకర్ నుంచి రెండు సినిమాలు రావడం .. బహుశ ఆయన కెరీర్ లోనే తొలిసారి. ఇదంతా ప్లానింగ్ సరిగ్గా కుదరకపోవడం వలనే జరిగింది.
సినిమాల వాయిదా కొన్నిసార్లు ఇతర సినిమాలపై చాలా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు పుష్ప 2 డిసెంబర్ 6 కి వెళ్ళింది. అప్పటికే ఆ డేట్ లో వున్న సినిమాకి ఇది పెద్ద తలనొప్పి. తప్పనిసరిగా వాయిదా వేసుకోవాలి. లేదా ధైర్యం చేసి పుష్పకి పోటీగా వదిలితే ఏ రేంజ్ లో నష్టం చేకూరుతుందో తెలీదు. మరో డేట్ కి ప్లాన్ చేస్తే.. దగ్గరలో డేట్లు వుండవు. అప్పటికే రిజర్వ్ అయిన సినిమాలు ఖాళీ లేదనే సిగ్నల్స్ ఇస్తుంటాయి. దీంతో విడుదల చేయాలా వాయిదా వేయాలా అనే డైలమాలో పడిపోతారు నిర్మాతలు. మొత్తానికి సినిమాల వాయిదాలపర్వం నిర్మాతలని కుదేలు చేసే వ్యవహారమే.