ఇది వరకు ఏ పది మంది మాట్లాడుకున్నా.. వాళ్ల టాపిక్కు ఇది వరకు సినిమా గురించో, రాజకీయాల గురించో ఉండేది. ఇప్పుడు దాన్ని `కరోనా` ఆక్రమించేసింది. అందరి నోటా.. ఇదే మాట! కరోనా.. కరోనా. తెలుగు రాష్ట్రాలలో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచీ – ఈ అలజడి మరింత ఎక్కువైంది. ప్రధాన నగరాల్లో అయితే జనాలంతా మాస్కులతో కనిపిస్తున్నారు. మాస్కులకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడిపోయింది. టీవీ ఛానళ్లూ, పేపర్లూ… కరోనాని ఆక్రమించేశాయి.
కరోనా ఎఫెక్ట్ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ.. చిత్రసీమపై పడబోతోంది. ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ అంటే… అంతా భయపడిపోతున్నారు. కొన్ని సినిమాల ఫారెన్ షెడ్యూళ్లు కూడా కాన్సిల్ అయ్యాయి. వెళ్లినా.. భయం భయంగా షూటింగ్ చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు థియేటర్లపైనా కరోనా ఎఫెక్ట్ మొదలైంది. జన సమూహంలో ఉంటే కరోనా త్వరగా వ్యాపించే ఆస్కారం ఉందని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. జనం గుమ్ముగూడిన ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నాయి. దాంతో జనాల్లో భయం పెరిగింది. జనసమూహాలకు కేరాఫ్ అడ్రస్ థియేటర్లు. దాంతో… థియేటర్లకు వెళ్లే వాళ్లపై కరోనా భయం తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది.
వచ్చే వేసవి చిత్రసీమకు కీలకమైన సీజన్. ఈ సీజన్లో సినిమాలెక్కువగా విడుదల అవుతాయి. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ నిర్మాతల భయాలన్నీ కరోనా చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా మహమ్మారి మరింతగా వ్యాపించి, ప్రజల్ని భయపెడితే – జనాలు థియేటర్లకు రావడం గగనం అయిపోతుంది. దాంతో సమ్మర్ వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి కరోనా భయాన్ని పెంచి పోషిస్తున్నవి మీడియా సంస్థలే. తెలుగు రాష్ట్రాలలో కరోనాకి సంబంధించిన ఒక్క అనుమానిత కేసు నమోదైనా – అదేదో పెను ప్రళయం సంభవించినట్టు.. దానిపైనే
అప్డేట్లూ, లైవ్ బులిటెన్లూ ఇచ్చి నానా హంగామా చేస్తోంది. దాంతో ”నిజంగానే కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తోందా” అనే అనుమనాలు, భయాలు సాధారణ ప్రజానికంలో ఎక్కువైపోతున్నాయి. ఏదైనా ఓ వైరస్ ప్రమాదకరమైన రీతిలో మారుతోందంటే, దానిపై అవగాహన కల్పించడం మంచిదే. కానీ… అది భయపెట్టే రీతిలో ఉండకూడదు. కరోనాని మొండి రాక్షసిలా భూతద్దంలో చూపించడం – సరైన పద్ధతి కాదు. కరోనా వైరస్ వంద మందికి సోకితే… అందులో చనిపోతున్నవారి సంఖ్య ఒక్క శాతం కూడా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. చైనాలో మొదలైన కరోనా విజృంభణ అక్కడ క్రమంగా తగ్గు మొహం పడుతోంది. ఇది వరకు కూడా ఎబోలా లాంటి వైరస్లు ఇలానే భయపెట్టాయి. అలాంటి మహమ్మారీలనే తరిమికొట్టింది మన వైద్య శాస్త్రం. కరోనాకీ విరుగుడు తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఈలోగా ఇలాంటి కష్టనష్టాల్ని కొన్నింటిని భరించాల్సివస్తోంది.