అల్లు అర్జున్ – సంధ్య ధియేటర్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇన్నాళ్లూ కామ్ గా ఉన్న ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇప్పుడు మెల్లమెల్లగా తమ అభిప్రాయాలు చెప్పడం మొదలెట్టారు. బన్నీ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తరవాత తనని కలిసి, సానుభూతి తెలిపిన సురేష్ బాబు సైతం ఇప్పుడు బన్నీదే తప్పంటూ పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు.
పబ్లిక్ ప్లేస్ లో ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. స్కూల్స్ నుంచే పిల్లలకు నేర్పించాలి. నీ ఇంట్లో నువ్వు ఎగురు, డాన్స్ చేయ్.. ఏదైనా చేయ్. బయటకు వచ్చినప్పుడు కాస్త పద్ధతిగా ఉండాలి కదా“ అంటూ సురేష్ బాబు చెప్పిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో పాటు తమ్మారెడ్డి భరద్వారా కూడా బన్నీ ఇష్యూపై కీలకమైన కామెంట్లు చేశారు. గతంలో పెద్ద హీరోలు కూడా తమ సినిమాల్ని ధియేటర్లో, అభిమానులతో కలిసి చూశారని, అప్పుడు ఇలాంటి ఘటనలేమీ జరగలేదని, ఎలాంటి హడావుడీ లేకుండా సింపుల్ గా వెళ్లిపోతే… ఇష్యూ ఇంత పెద్దది అయ్యేది కాదని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. బన్నీ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని, అక్కడితో వదలకుండా దాన్ని కవర్ చేయడానికి అబద్ధాలు ఆడేయడం వల్ల పరిస్థితి సంక్లిష్టంగా మారిపోయిందని, ఒక్కడి కోసం, ఒకరి ఈగో కోసం… ఇండస్ట్రీ మొత్తం వెళ్లి, ముఖ్యమంత్రి ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం వచ్చేది కాదని తమ్మారెడ్డి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
బన్నీ ఇష్యూ తరవాత చిత్రసీమతో ముఖ్యమంత్రి భేటీ అవ్వడం, ఆ తరవాత జరిగిన పరిణామాలూ తెలిసిన విషయాలే. రేవంత్ రెడ్డి సీఎం అయిన తరవాత చిత్రసీమతో సరైన మీటింగ్ జరగలేదు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీఎంతో టాలీవుడ్ పెద్దలు భేటీ వేసేవారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి వేరు. టాలీవుడ్ జుట్టంతా సీఎం చేతుల్లో ఉన్నప్పుడు జరిగిన భేటీ ఇది. కాబట్టి.. చాలా విషయాల్లో చిత్రసీమ కాంప్రమైజ్ అవ్వాల్సివచ్చిందన్నది కొంతమంది సినీ ప్రముఖుల వాదన.