ఐఏ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ) మెల్లమెల్లగా చిత్రసీమలోకి చాప కింద నీరులా విస్తరిస్తోంది. మొన్నా మధ్య ఏఐతో ఫస్ట్ లుక్, టీజర్ డిజైన్ చేశారు. పాటలు పాడించారు. ఇప్పుడు ఏకంగా ఈ పరిజ్ఞానం వాడి డబ్బింగ్ చెప్పేస్తున్నారు. పేర్లు బయటకు చెప్పడం లేదు కానీ, త్వరలో విడుదల కాబోతున్న కొన్ని తెలుగు చిత్రాలకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ఉపయోగించి డబ్బింగ్ చెప్పించారు. సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు ఉంటాయి కదా. ఒకట్రెండు డైలాగులతో సరిపెట్టుకొనే క్యారెక్టర్స్. వాటికోసం డబ్బింగ్ ఆర్టిస్టుల్ని వెదుక్కోవడం, వాళ్లకు ఇంతో అంతో పారితోషికాలు చెల్లించడం ఎందుకని, ఏఐతో డబ్బింగులు చెప్పించడం మొదలెట్టారు. అసలు ఆ పాత్రలకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ఉపయోగించి, డబ్బింగ్ చెప్పారన్న సంగతి కూడా ప్రేక్షకులు పట్టించుకోనంత చిన్న పాత్రలు అవి.
అయితే… ఇది ఇక్కడితో ఆగదు. క్రమంగా స్టార్ హీరోలు కూడా ఈ సాంకేతికతకు అలవాటు పడిపోతారేమో అనిపిస్తోంది. ఏఐతో ఎవరి వాయిస్ అయినా సరే, సృష్టించొచ్చు. వారి వాయిస్ ఫ్రీక్వెన్సీని పట్టుకొంటే చాలు. ఎలాంటి ఎమోషన్ అయినా, గొంతులో పలికించొచ్చు. కొంతమంది బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులు షూటింగుల్లో తలమునకలైపోయి, డబ్బింగ్ చెప్పడానికి తీరిక లేకుండా గడుపుతుంటారు. అలాంటి వాళ్ల వాయిస్ ఫ్రీక్వెన్సీ పట్టుకొని, ఏఐతో డబ్బింగ్ చెప్పించే అవకాశం ఉంది. అది వర్జినల్ వాయిసా, కాదా? అనే విషయంలోనూ ఎవరికీ ఎలాంటి అనుమానాలూ రావు. అంతలా పర్ఫెక్ట్ గా సింక్ అయిపోతుంది. ఈ సాంకేతికత ఇక్కడితో ఆగదు. భవిష్యత్తులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం, ఏఐతో సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐతో పాటలు పాడించేస్తున్నారు. హీరోలు, హీరోయిన్లు సెట్స్‌పైకి రాకుండానే వారి రూపాల్ని ఏఐతో సృష్టించి, వాటితోనే సినిమాలు పూర్తి చేసే రోజులు ఇంకెంతో దూరంలో లేవు.