లేచిందే లేడికి పరుగు… అన్నట్టుంది టాలీవుడ్ పరిస్థితి. సంక్రాంతి కి అప్పుడే బెర్తులు ఖాయం చేసుకునే పనిలో పడ్డాయి పెద్ద సినిమాలు. సంక్రాంతి ఇంకా 5 నెలలుంది. అప్పుడే రిలీజ్ డేట్ల జోరు మొదలైపోయింది. సంక్రాంతి పెద్ద సీజన్. టాలీవుడ్ కి చాలా కీలకం. ముందే అప్రమత్తమై రిలీజ్ డేట్లు ప్రకటించుకోవాల్సిందే. కానీ.. మరీ ఇంత తొందరేమిటో. ఎందుకంటే… కరోనా వల్ల పరిస్థితుల్లన్నీ తల్లకిందులైపోయాయి. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. రేపు థియేటర్లు ఉంటాయా? ఉండవా? అనేదే పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అలాంటిది 5 నెలల ముందే కర్చీఫ్ లు వేసుకోవడం అంటే అత్యుత్సాహమే.
పైగా ఒకటా రెండా..? ఏకంగా 5 సినిమాలు ఈసారి బరిలో దిగబోతున్నాయి. వీటితో పాటు ఇంకొన్ని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు సినిమాలు బెర్తులు ఖాయం చేసేసుకున్నాయి. వెంకటేష్ ఎఫ్ 3 కూడా సంక్రాంతికే రాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. నాగార్జున – కల్యాణ్ కృష్ణ కాంబోలో రాబోతున్న `బంగార్రాజు`నీ సంక్రాంతికే తెస్తున్నార్ట. `సోగ్గాడే చిన్ని నాయిన` సంక్రాంతికి విడుదలై, నాగ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే ఆయనా సంక్రాంతిపై కన్నేశారు.
సంక్రాంతి పెద్ద పండగ. కాబట్టి.. మూడు సినిమాల వరకూ ఛాన్స్ ఉంటుంది. ఈసారి 5 సినిమాలు తలపడితే మాత్రం నాగ్, వెంకీ సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. పవన్, ప్రభాస్, మహేష్ సినిమాలకే థియేటర్లు ప్రధమ తాంబూలం ఇస్తాయి. ఆ మూడు సినిమాల ముందు ఏదైనా చిన్నదిగానే కనిపిస్తుంది. కాబట్టి.. వెంకీ, నాగ్ సినిమాలకు తిప్పలు తప్పకపోవొచ్చు. ఎంత సంక్రాంతి సీజన్ అయినా ఒకేసారి ఇన్నిసినిమాలు గుంపుగా రావడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే… ఎవరి తాపత్రయం వాళ్లది. సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవాలని తపించడం సహజం. కాకపోతే.. వాస్తవ పరిస్థితుల్నీ ఆలోచించాలి. ఇది కరోనా కాలం. జనాలు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. సంక్రాంతి సీజన్ లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేం. పైగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు ఒకొక్కటిగా మూతపడుతున్నాయి. సంక్రాంతి సమయానికి థియేటర్ల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ సంక్రాంతి సినిమాలకు ప్రతికూలంశాలుగా మారే ప్రమాదం ఉంది.