డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది. డ్రగ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఈ ఉద్యమంలో చిత్రసీమ కూడా పాలుపంచుకోవాలని ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చిత్రసీమ తరపున నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ వంతు ప్రయత్నం చేయాలని, అప్పుడే చిత్రసీమ కష్టానష్టాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిన నేపథ్యంలో టాలీవుడ్ లో చలనం వచ్చింది. డ్రగ్స్ పై పోరాటంలో భాగంగా చిరంజీవి ఓ ప్రకటనలో నటించారు. ఇప్పుడు మిగిలిన నటీనటులు కూడా బరిలోకి దిగుతున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో, అలానే డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు.
యువ కథానాయకులు, కథానాయికలు కొంతమంది కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ వీడియో షూట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు. ఈ వీడియోలో దాదాపు తెలుగు చిత్రసీమలోని కథానాయకులంతా కనిపించే అవకాశం ఉంది. థియేటర్లో సినిమా ప్రారంభానికి ముందు ముఖేష్ ప్రకటన ఎలా వస్తుందో, అలానే ఈ యాడ్ ని కూడా ప్రసారం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇకపై సినిమాల్లో కూడా డ్రగ్స్, మత్తు పదార్థాల ప్రస్తావన వచ్చినప్పుడు డిస్లిమర్లు వేసే అవకాశం గురించి కూడా ఆలోచిస్తున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టు… డ్రగ్స్ వాడకంపై కూడా ఇలాంటి డిస్క్లీమర్ వస్తుందన్నమాట. ఇదే కాకుండా యాంటీ డ్రగ్స్ కాంపెనింగ్ లా ఓ కార్యక్రమం నిర్వహించాలని టాలీవుడ్ భావిస్తోంది. అందుకోసం ఓ ప్రణాళిక సైతం సిద్ధం చేస్తోంది. `మా`, ఫిల్మ్ ఛాంబర్ తో పాటు చిత్రపరిశ్రమకు చెందిన మిగిలిన శాఖలు కూడా అందులో పాలు పంచుకోనున్నాయి.