2021 ఎప్పుడొస్తుందా? 2020ని ఎప్పుడు తరిమేస్తుందా? అని ఎదురు చూశారంతా. సినిమావాళ్లూ అంతే. కొత్త ఆశలతో కొత్త యేడాది ఆరంభిద్దామని.. 2021కి ఘనంగానే హారతులు పట్టారు. సంక్రాంతి సీజన్ పుణ్యమా అని జనవరిలో కొత్త సినిమాలు ఆర్భాటంగా విడుదలయ్యాయి. 2020లో రావల్సిన కొన్ని చిన్న సినిమాలు జనవరిలోనే వరుస కట్టాయి. దాంతో.. జనవరి కాస్త థియేటర్ల దగ్గర కొత్త కళ కనిపించింది.
సంక్రాంతి సీజన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. క్రాక్, మాస్టర్, అల్లుడు అదుర్స్, రెడ్…. ఇవన్నీ సంక్రాంతి పుంజులే. వీటిలో క్రాక్ మాత్రమే నిలబడింది. 50 శాతం సిట్టింగ్ ఆక్యుపెన్సీలోనూ 30 కోట్లకు పైగా సాధించి – హుషారు తెప్పించింది. మాస్టర్ ఫ్లాపైనా.. తెలుగు నాట మంచి ఓపెనింగ్సే వచ్చాయి. రెడ్ కి డివైడ్ టాక్ వచ్చినా, సంక్రాంతి సీజన్ పేరు చెప్పి, మంచి వసూళ్లు రాబట్టుకుంది. అల్లుడు అదుర్స్ డిజాస్టర్ గా తేలిపోయింది. కాకపోతే… తొలిరోజు గట్టి ఓపెనింగ్సే తెచ్చుకుంది. దాంతో.. భారీ నష్టాల నుంచి తృటిలో తప్పించుకుంది.
సంక్రాంతి సీజన్ తరవాత చిన్న సినిమాలు ఎక్కువే వచ్చినా.. వాటిలో చెప్పుకోదగనవి మాత్రం `బంగారు బుల్లోడు`, `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాలే. యధావిధిగా నరేష్ మరో ఫ్లాపు కొట్టేశాడు. కథలో, కథనంలో ఏమాత్రం కొత్తదనం చూపించని నరేష్ చిత్రానికి వసూళ్లూ రాలేదు. 50 శాతం ఆక్యుపెన్సీలోనూ ప్రేక్షకులు పలచగానే కనిపించారు. ఇక ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా `30 రోజుల్లో..`కి మాత్రం మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అదంతా.. `నీలీ నీలీ ఆకాశం` పాట మహిమే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినా…. విమర్శకుల దృష్టిలో ఇది ఫ్లాప్ మాత్రమే.
జనవరి వల్ల… టాలీవుడ్ వసూళ్ల రూపంలో సాధించేం లేదు. ఈ నెలలో దక్కింది ఒకే ఒక్క హిట్. మిగిలినవన్నీ ఫ్లాపులే. సంక్రాంతి సీజన్ వల్ల.. రెడ్ సినిమా గట్టెక్కింది గానీ, లేదంటే… అదీ డిజాస్టర్ లిస్టులో చేరిపోవాల్సిందే. కాకపోతే… జనాలు థియేటర్లకు అలవాటు పడ్డారు. కరోనా భయాలు లేకుండా.. స్వేచ్ఛగా వస్తున్నారు. ఇప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీ కూడా వచ్చేసింది. కాబట్టి… నిర్మాతలకు కొత్త ధైర్యం. ఫిబ్రవరిలో జోరుగా సినిమాలొస్తున్నాయి. ఈ నెలలో రెండు మూడు విజయాలు చేతికొస్తే… అసలైన వేసవి సీజన్‌కి బూస్టప్ దొరికేసినట్టే.