ఈనెల 14న లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశల వారిగా లాక్ డౌన్ నిబంధనల్ని సడలించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఇప్పటికే సంకేతాలు అందేశాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తేసి, థియేటర్లకు పర్మిషన్లు ఇచ్చినా సరే, మరో మూడువారాల పాటు సినిమాల్ని విడుదల చేయకూడదని ఓ ఉమ్మడి నిర్ణయం తీసుకోబోతోందని టాక్. లాక్ డౌన్ ఎత్తేసినా, పరిస్థితులు సద్దుమణగడానికి కొంత సమయం పడుతుంది. దానికి తోడు థియేటర్లకు, షాపింగ్ మాల్స్కీ అనుమతులు ఇవ్వకపోవొచ్చు. ఎంత లేట్ అయినా… మే తొలి వారం నుంచి కొత్త సినిమాలు వస్తాయని భావించడంలో తప్పులేదు. కానీ చిత్రసీమ మాత్రం అందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. భవిష్యత్తుని, సినీ కార్మికుల ఆరోగ్యాన్నీ దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ ఎత్తేసినా, మరో మూడు వారాల పాటు సినిమా షూటింగులతో పాటు, సినిమా విడుదల కూడా నిలిపివేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తేసినట్టు ప్రకటన వస్తే.. అప్పుడు చిత్రసీమ ఈ కొత్త నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. ఒకవేళ లాక్ డౌన్ కొనసాగితే మాత్రం.. ప్రకటన వెలువరించాల్సిన అవసరమే లేదు. ఇందుకు సంబంధించి `మా`, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.